పవన్ మాటిస్తే అలా ఉంటుంది మరి

admin
Published by Admin — June 19, 2026 in Telangana
News Image

పవర్ స్టార్ కం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి.. ఆయన పెద్ద మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆయన్ను వ్యతిరేకించే వారు సైతం.. వ్యక్తిగతంగా పవన్ తీరును అభిమానిస్తుంటారు. ఆయన మంచితనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆయన డిఫరెంట్ అన్న మాటను చెబుతుంటారు. చివరకు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించే ఆయన ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు సైతం తమ వ్యక్తిగత సంభాషణల్లో పవన్ తీరును పొగిడేస్తుంటారు.

రాజకీయంగా విభేదిస్తామే తప్పించి.. వ్యక్తిగతంగా ఆయన్ను వంక పెట్టలేమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తనను అభిమానించే వారి విషయంలో పవన్ ఎప్పుడు ముందుంటారు. తన వరకు వచ్చిన ఏ అంశానికైనా స్పందించే గుణం ఆయన సొంతం. అలాంటిది తనను అమితంగా ప్రేమించే అభిమానులకు చేయాల్సి వస్తే.. ఎంతకైనా వెనుకాడరన్న మాట ఆయన గురించి తెలిసినవారంతా చెబుతుంటారు.

కట్ చేస్తే.. తెలంగాణలోని వరంగల్ పట్టణానికి చెందిన చిన్నారి నిరంజన్ ఉదంతం తాజా ఉదాహరణగా చెప్పాలి. జన్యు సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న అతడి గురించి తెలిసిన పవన్ కల్యాణ్ స్పందించి తానే స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లటమేకాదు.. చిన్నారితో చాలాసేపు గడపటం.. తల్లిదండ్రులతో మాట్లాడటం తెలిసిందే. చిన్నారి నిరంజన్ ను కలిసినప్పుడు.. నీకేం కావాలన్న పవన్ మాటలకు.. తాను ఆడుకోవటానికి ఒక పప్పీ కావాలని.. వీడియోలు, సినిమాలు చూసేందుకు ఒక ట్యాబ్ కావాలని అడగటం తెలిసిందే.

దీనికి స్పందించిన పవన్.. గంటల వ్యవధిలోనే చిన్నారి కోరికల్ని తీర్చేయటం విశేషం. తన టీంతో నిరంజన్ అడిగిన కోరికల్ని చెప్పటమేకాదు.. వాటిని తీర్చేశారు. హైదరాబాద్ లోని డాగ్ ఫాంలో అత్యంత ఖరీదైన లాసా అప్సో జాతికి చెందిన పప్పీని.. వీడియోలు చూసేందుకు వీలుగా ఖరీదైన ట్యాబ్ ను తన టీంతో నిరంజన్ ఇంటికి పంపారు. పవన్ టీం ఆ బహుమతులను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు. వాటిని చూసినంతనే చిన్నారి నిరంజన్ మురిసిపోయాడు. ఏమైనా.. పవన్ మాట ఇస్తే గంటల్లో జరిగిపోవాల్సిందే అన్న మాట మరోసారి రుజువైందని చెప్పాలి.

Tags
hero pawan kalyan fan sick met boy
Recent Comments
Leave a Comment

Related News