తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని సాధనంగా చేసుకొని కేసీఆర్, అతని కుటుంబం వందల ఎకరాలు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సంపాదించుకున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆరోపించి, ఆ భూములపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.30 రోజుల లోపు విచారణ పూర్తి చేయాలని అధికారులకు గడువు నిర్దేశించారు. ఆ గడువు మించితే సంబంధిత అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే కేసీఆర్ వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో అని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబానికి మొత్తం 439.40 ఎకరాల భూమి ఉందని, వివిధ ప్రాంతాల్లోని స్థిరాస్తుల వివరాలను కూడా వెల్లడించారు. 700 ఎకరాల ఫామ్‌హౌస్ భూమి వ్యవహారం ఏమిటో స్పష్టం చేయాలని, అందులో 340 ఎకరాలు ప్రభుత్వ భూమి అని ఆరోపించారు. కేసీఆర్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణలో ప్రభుత్వ భూమి అని తేలితే దాన్ని పేదలకు పంపిణీ చేస్తానని ప్రకటించారు.