ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు పడింది. అయితే, ఆ వేటు వేసింది తెలంగాణ స్పీకర్ కాదు. తెలంగాణ హైకోర్టు. అవును...దానం పార్టీ ఫిరాయించారని తెలిసినా కళ్లకు గంతలు కట్టుకొని స్పీకర్ సైలెంట్ అయ్యారు. కానీ, కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయ దేవత మాత్రం దానంపై వేటు వేసింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి...ఆ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసన దానం వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా సంచలనం రేపింది.
ఇంత పబ్లిగ్ గా పార్టీ మారకుండానే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో మళ్లీ ఏం తెలియనట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగడం దానం నాగేందర్ కే చెల్లింది. ఇంత జరిగినా సరే అసలేం జరగలేదు అన్నట్లు వ్యవహరించిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరు ఈ ఎపిసోడ్ కే హైలైట్. దీంతో, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు వేయడంతో చివరకు కోర్టు జోక్యం చేసుకొని దానం శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే తన సస్పెన్షన్ పై దానం నాగేందర్ స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పారు. ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా పోటీకి, కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని దానం చెప్పారు. ఇక, తనకు కొట్లాడడం కొత్త కాదని అన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండానే దానం వెళ్లిపోయారు. దానంపై వేటు సరే, మరి ఆయన లాగే పార్టీ మారకుండానే మారినట్లు చలామణీ అవుతున్న మిగతా ఎమ్మెల్యేల సంగతేంటి అన్న చర్చ మొదలైంది. వారిపై అయినా స్పీకర్ చర్య తీసుకుంటారా..లేక కోర్టు జోక్యం చేసుకోక తప్పదా అన్నది తేలాల్సి ఉంది.
మరోవైపు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పీ) దాఖలు చేశారు.