ఇప్పటితరం ఎవరైనా వడ్డే నవీన్ అన్నంతనే.. ఆయన్నో సినీ హీరోగా గుర్తించే అవకాశమే లేదు. 1990-2000 మధ్యలో టీనేజ్ లో ఉన్న వారందరికి అతను సుపరిచితుడు. దాదాపు పాతికేళ్లు నటనకు దూరంగా ఉన్నారు. అయితే.. మధ్యలో రాంగోపాల్ వర్మ మూవీలో విలన్ క్యారెక్టర్ యాక్ట్ చేసినా.. ఆయన గురించి ప్రత్యేక బజ్ లేని కారణంగా.. ఇప్పటి యూత్ కు ఆయన గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన వడ్డే రమేష్ కుమారుడే వడ్డే నవీన్. హీరోగా దాదాపు 30 సినిమాలు చేసిన అతను అప్పట్లో ఫ్యామిలీ ఆఢియన్స్ కు బాగానే దగ్గరయ్యారు. తనదైన గుర్తింపును పొందారు.
ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండి.. వ్యాపార రంగం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. రియల్ ఎస్టేట్ తో పాటు ఫైనాన్స్ ఇతర రంగాల్లో ఆయన తన సత్తాచాటారు. కట్ చేస్తే.. ఈ శుక్రవారం ఆయన ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ అన్న సినిమాతో కమ్ బ్యాక్ అవుతున్నారు. ఆయనకు చెందిన వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ మూవీని స్వయంగా నిర్మించారు. పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రంగా చెబుతున్న ఈ మూవీ మీద ఆసక్తి పెరుగుతోంది. కొత్త దర్శకుడ్ని (కమల్ తేజ నార్ల)పరిచయం చేస్తూ.. తన సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేస్తున్నారు వడ్డే నవీన్.
తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్డే నవీన్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న కాలంలో.. వడ్డే నవీన్ కారణంగానే ఎన్టీఆర్ ఆది సినిమా చేసే అవకాశం దక్కిందని చెప్పటమే కాదు.. తనను అసిస్టెంట్ డైరెక్టర్ గా మానేసి.. దర్శకుడిగా ప్రయత్నాలు చేయాలని చెప్పింది వడ్డే నవీన్ గా వెల్లడించారు.
ఏమైనా అవసరం ఉంటే తనను కలవాలని అప్పట్లో చెప్పారన్న వినాయక్.. వడ్డే నవీన్ చేసిన సినిమాల్లో 90 శాతం ఆయనకు నచ్చి చేయలేదన్న ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. అంతేకాదు.. వడ్డే నవీన్ పవర్ ఎంతన్న విషయాన్ని చెప్పే క్రమంలో అప్పుడెప్పుడో జరిగిన ఒక ఉదంతం గురించి చెప్పారు. సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతం గురించి వింటే.. వడ్డే నవీన్ పరపతి ఈ స్థాయిలో ఉంటుందా? అన్న ఆశ్చర్యానికి గురి కాక మానదు.
ఒక సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లి వస్తుంటే.. యూనిట్ లోని ఒక వ్యక్తి విమాన బాత్రూంలో రహస్యంగా సిగిరెట్ తాగాడని.. తమ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయానికి ఏకే 47 గన్స్ తో పోలీసులు వచ్చి.. సదరు యూనిట్ వ్యక్తిని అరెస్టు చేశారన్నారు. అప్పట్లో తమకు ఎవరూ తెలీదని.. దీంతో వడ్డే నవీన్ కు సమాచారం అందిస్తే.. ఆయన చేసిన ఒక్క ఫోన్ కాల్ తో అరెస్టు అయిన యూనిట్ సిబ్బందిని విడిచి పెట్టారన్నారు. అబ్బో.. ఇంత పవర్ ఫుల్ వ్యక్తా? అని తాను ఆశ్చర్యపోయినట్లుగా చెప్పారు. వివి వినాయక్ రివీల్ చేసిన వడ్డే నవీన్ రేంజ్ ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఆయన గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉందని చెప్పాలి.