బెజవాడ రాజకీయాల్లో ‘కేశినేని బ్రదర్స్’ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు ఒకే తాటిపై నడిచిన అన్నదమ్ములు.. నేడు నడిరోడ్డుపై పొలిటికల్ యుద్ధానికి తెరలేపారు. ఎన్నికల ఓటమి తర్వాత "నాకు రాజకీయాలు వద్దు.. బాబోయ్" అంటూ తెరమరుగైనట్లు నటించిన మాజీ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani).. తెరవెనుక మాత్రం సొంత తమ్ముడు, ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) టార్గెట్‌గా పెను వ్యూహాన్నే నడిపినట్లు తెలుస్తోంది. అయితే, అన్న వేసిన స్కెచ్‌లకు తమ్ముడు వేసిన రివర్స్ స్కెచ్ ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తమ్ముడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా కేశినేని నాని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉర్సా క్లస్టర్స్ భూ కుంభకోణాలంటూ పాత కాగితాలను తెరపైకి తేవడమే కాకుండా, ఈడీ కి లేఖలు రాస్తూ వాటిని ముందే సోషల్ మీడియాలో లీక్ చేయడం బెజవాడలో చర్చనీయాంశమైంది. వీటన్నింటికీ పరాకాష్టగా.. ఎంపీ చిన్ని(MP Chinni) ఆఫీసులో రూ. 27 కోట్ల నల్లధనం దొంగతనం జరిగిందని, ఆ దొంగతనం చేసిన సిబ్బంది చేతులపై యాసిడ్ పోసి చిత్రహింసలు పెట్టారంటూ నాని సోషల్ మీడియాలో ఒక భయంకరమైన కథనాన్ని వదిలారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ యాసిడ్ స్టోరీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
అయితే, అన్న చేస్తున్న ఈ నిరంతర ఆరోపణలపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఎంపీ కేశినేని చిన్ని(Kesineni Chinni), ఈసారి రూట్ మార్చారు. లీగల్ నోటీసులకు కూడా అన్న లొంగకపోవడంతో.. నేరుగా పటమట పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేస్తూ రివర్స్ స్కెచ్ వేశారు. చిన్ని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేశినేని నానిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 204, 351, 352, 353, 356, 61 తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఎప్పుడూ లీగల్ ఇష్యూస్ నుండి తప్పించుకునే నాని.. ఇప్పుడు అడ్డంగా బుక్కై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒకప్పుడు వ్యాపారంలోనూ, రాజకీయాల్లోనూ అన్యోన్యంగా ఉన్న ఈ సోదరుల మధ్య ఇంతటి దూరం రావడానికి నానికున్న మితిమీరిన అహంకారమే కారణమనే చర్చ నడుస్తోంది. అహంకారంతో టీడీపీని వీడి, వైసీపీ(YCP)లో చేరి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నాని రాజకీయంగా ఒంటరి కాగా.. గ్రౌండ్ లెవెల్‌లో ప్రజల్లో ఉంటూ గెలిచిన చిన్ని ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. తమ్ముడి రాజకీయ ఎదుగుదలను భరించలేక, నిరంతరం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న మాజీ ఎంపీ కేశినేని నాని.. తమ్ముడు వేసిన లీగల్ స్కెచ్‌తో ఇప్పుడు కోర్టులు, పోలీసుల చుట్టూ తిరగాల్సిన చిక్కుల్లో పడ్డారు.