2024 ఎన్నికల్లో సాధించిన 100 శాతం విజయంతో జనసేన సరికొత్త చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అటు ప్రభుత్వంలో నంబర్ 2 స్థానంలో ఉంటూ, ఇటు క్షేత్రస్థాయిలో తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. అయితే, రాజకీయాల్లో నిరంతరం అప్రమత్తంగా లేకపోతే ఎంతటి విజయాలైనా ఆవిరైపోవడానికి ఎంతో సమయం పట్టదు. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా విశ్లేషకుల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ గ్రాఫ్ పీక్స్‌లో ఉన్నప్పటికీ.. పార్టీ అంతర్గత నిర్మాణంలో కొన్ని లూప్‌హోల్స్ కనిపిస్తున్నాయని, వీటిని పవన్ తక్షణమే గమనించకపోతే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
నిజానికి నాయకుడిగా పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని ఎవరూ శంకించలేరు. కానీ, ఒక రాజకీయ పార్టీ లాంగ్ రన్ లో నిలబడాలంటే కేవలం నాయకుడి ఇమేజ్ మాత్రమే సరిపోదు. క్షేత్రస్థాయిలో జెండా మోసే కార్యకర్తలు బలంగా ఉండాలి. బూత్ స్థాయిలో జనసేన(Janasena)కు ఆశించిన స్థాయిలో కమిటీలు, గట్టి కార్యకర్తల నెట్‌వర్క్ లేదనేది బహిరంగ రహస్యం. గతంలో పవన్ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. ఇటీవల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో వేగం కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనమనే టాక్ వినిపిస్తోంది. నాయకత్వం ఎంత బలంగా ఉన్నా, గ్రాస్ రూట్ లెవెల్‌లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే సైన్యం లేకపోతే ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవు.
మరోవైపు, 2024 లో జనసేన క్లీన్ స్వీప్ చేసిన 21 నియోజకవర్గాల్లో.. ప్రస్తుత పరిస్థితిపై రకరకాల సమీక్షలు నడుస్తున్నాయి. అందులో కనీసం మూడు నుంచి నాలుగు స్థానాల్లో స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో, సొంత క్యాడర్‌లోనే కొంత అసంతృప్తి మొదలైనట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. గెలిచిన కొత్త ఉత్సాహంలో కొందరు నేతలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రాబోయే రోజుల్లో యాంటీ-ఇంకంబెన్సీ(Anti-incumbency) పెరిగితే ఆ స్థానాలను కాపాడుకోవడం జనసేనకు పెద్ద సవాలుగా మారుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్ట్రాటజీని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు విశ్లేషకులు. పక్క రాష్ట్రాలపై లేదా ఇతర వ్యూహాలపై దృష్టి పెట్టే కంటే.. ముందుగా ఏపీ(AP)లోనే పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడం అత్యంత కీలకం. ఎక్కడైతే పార్టీకి పట్టుందో, అక్కడ బూత్ స్థాయి నుంచి బలమైన పునాదిని నిర్మించుకోవాలి. పునాది బలంగా ఉంటేనే భవిష్యత్తులో వేసే ప్రతి అడుగు స్థిరంగా ఉంటుంది. మరి, రాజకీయ వర్గాల్లో నడుస్తున్న ఈ అంతర్గత విశ్లేషణలను, గ్రౌండ్ రిపోర్ట్స్‌ను పవన్ కళ్యాణ్ గమనించి ఎలాంటి నష్టనివారణ చర్యలు తీసుకుంటారో చూడాలి.