దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన సమీకరణం తెరపైకి వస్తోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్(DK Shivakumar)కు కాంగ్రెస్ అధిష్టానం ఒక భారీ టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది. కేవలం కర్ణాటకకే పరిమితం కాకుండా, సౌత్ ఇండియా మొత్తం హస్తం పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ఆయన భుజాలపై పెట్టిందట. ఈ క్రమంలోనే అందరి దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పడింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తెరవెనుక వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో డీకే శివకుమార్‌కు ఉన్న పాత అనుబంధాన్ని వాడుకుని, ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతోందట. ఇందులో భాగంగా రెండు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదటిది... వైఎస్ జగన్(YS Jagan)తో నేరుగా పొత్తు పెట్టుకుని ఏపీలో కలిసి సాగడం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే... ప్లాన్-బి కింద వైఎస్సార్సీపీ(YSRCP)కి ఉన్న బలమైన ఓటు బ్యాంకును తిరిగి కాంగ్రెస్ గూటికి మళ్లించడం. ఈ రెండు ఆప్షన్లలో దేన్నైనా సక్సెస్ చేసే పూర్తి బాధ్యతను డీకే శివకుమార్‌కు అప్పగించినట్లు సమాచారం.
ఒకవేళ ఈ వ్యూహం గనుక వర్కవుట్ అయితే దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని అధిష్టానం నమ్ముతోంది. ముఖ్యంగా ఏపీ(AP)లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్, ఓటు బ్యాంకును ఉపయోగించుకుని మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించాలనేది కాంగ్రెస్ అసలు ప్లాన్ అని అంటున్నారు. సీఎం సీటులో కూర్చున్న వెంటనే డీకే శివకుమార్ ఈ ఆపరేషన్ ఆంధ్రాపైనే ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా డీకే శివకుమార్ రంగంలోకి దిగితే ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో, జగన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.