విజనరీ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు కేబినెట్‌లో తొలిసారి చోటు సంపాదించుకున్న వారిలో గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు(Kondapalli Srinivasa Rao)తో పాటు, కడప జిల్లాకు చెందిన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు. వీరిలో ప్రజలకు చేరువ అవడంతో పాటు పార్టీ పరంగా అటు ప్రభుత్వం పరంగా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రజలకు మరింత చేరువ అయ్యే నాయకుల జాబితాలో కొండపల్లి శ్రీనివాస్ ఒకరు. నాలుగు శాఖలకు మంత్రిగా ఉన్న ఆయన.. కీలకమైన మహిళా ఓటు బ్యాంకును తీసుకురాగల సెర్ఫ్ శాఖను కూడా చూస్తున్నారు.
వివాదరహితంగా ఆయన రాజకీయాలు చేస్తున్నారనేది వాస్తవం. ఎక్కడ పదునైన విమర్శలు చేయాల్సి వచ్చినా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత విమర్శల జోలికి అసలు పోకుండా రాజకీయంగానే విమర్శలు చేయడంతో పాటు ప్రభుత్వానికి పనికి వచ్చేలాగా అదే విధంగా పార్టీ పరంగా కార్యకర్తలు నాయకులు కలుపుకొని వెళ్లేలాగా కూడా కొండపల్లి వ్యవహరిస్తున్నారు. కడప జిల్లా రాయచోటి నుంచి తొలిసారి విజయం సాధించిన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి(Mandipalli Ramprasad Reddy) చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు.
నియోజకవర్గాన్ని బలోపేతం చేయడంతో పాటు పార్టీ పరంగా కడప జిల్లాలో కీలకపాత్ర పోషించే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు(Chandrababu) ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకలింపు చేసుకునేలాగా ఆ వర్గాన్ని పార్టీకి చేరువ చేసేలాగా రాయలసీమ జిల్లాల్లో కొంతమందికి పదవులు ఇచ్చారు. ఇలాంటి వారిలో మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒకరు. ముఖ్యంగా రాయచోటి వంటి బలమైన వైసీపీ అభ్యర్థి ఉన్నచోట టిడిపి ఆయనకు టికెట్ ఇవ్వడంతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చింది.
వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గంలో కూడా బలమైన ప్రభావం చూపించాలని టిడిపి(TDP) ఉద్దేశం. అయితే వ్యక్తిగతంగా మండపల్లికి మంచి పేరు ఉన్నప్పటికీ ఇరుగుపొరుగు నియోజకవర్గాల్లో మాత్రం ఆయన ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. సొంత నియోజకవర్గంలోనే తనను తాను కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తక్కువ మెజారిటీతో విజయం సాధించడం.. బలమైన ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఉండడంతో మండపల్లి రాజకీయాలు మరింతగా పుంజుకోవాల్సిన అవసరం ఏర్పడింది.