ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక దశను, దిశను మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తనదైన శైలిలో వేగం పెంచారు. తాజాగా జరిగిన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం రాష్ట్రానికి ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోయింది. గత ఐదేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లున్న పారిశ్రామిక రంగంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఏకంగా రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఏపీ మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్ గా మారిందని బాబు నిరూపించారు.
ఈ భారీ పెట్టుబడుల వెనుక ఉన్న అసలు లక్ష్యం యువతకు ఉపాధి కల్పన. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేశారు. విశాఖపట్నం నుంచి కడప(Kadapa) వరకు, తిరుపతి నుంచి సత్యసాయి జిల్లా వరకు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ పరిశ్రమల స్థాపనకు బాటలు వేశారు. ఇది కేవలం ఒక సమావేశం కాదు, ఏపీ నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే ఉద్యోగాల జాతరగా అభివర్ణించవచ్చు.
విశాఖపట్నం నగరానికి పూర్వ వైభవం తెచ్చేలా రిలయన్స్ సంస్థ రూ. 1 లక్ష కోట్లతో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఇది ఐటీ రంగంలో ఏపీ(AP) తలరాతను మార్చేయడమే కాకుండా, వేల సంఖ్యలో హై-టెక్ ఉద్యోగాలను సృష్టించనుంది. మరోవైపు, రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేలా సత్యసాయి జిల్లాలో రూ. 51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ. 12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయి. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలబెట్టనున్నాయి.
కేవలం భారీ పరిశ్రమలే కాకుండా, యువత ఎంతో ఇష్టపడే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ తయారీ యూనిట్ తిరుపతికి రావడం ఒక సెన్సేషన్ అని చెప్పాలి. రూ. 2,500 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమతో చిత్తూరు, తిరుపతి ప్రాంతాలు ఆటోమొబైల్ హబ్‌గా మారనున్నాయి. మొత్తానికి బాబు మార్క్ స్పీడ్ తో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మళ్లీ ప్రగతి పథంలో పరుగులు తీస్తోంది.