రాజకీయాల్లో వ్యూహాలు వేరు.. గెలుపు గుర్రాలు వేరు. కానీ తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఒక విలక్షణమైన అద్భుతాన్ని ఆవిష్కరించాయి. లాటరీ కింగ్ గా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్(Santiago Martin) కుటుంబం రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టి, ఎవరూ ఊహించని రీతిలో ట్రిపుల్ ధమాకా నమోదు చేసింది. వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీల నుంచి పోటీ చేసినప్పటికీ, ముగ్గురు కుటుంబ సభ్యులు అద్భుత విజయాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విజయం లాల్‌గుడి నియోజకవర్గంలో నమోదైంది. శాంటియాగో మార్టిన్ భార్య లీమారోజ్ మార్టిన్, ఏఐఏడీఎంకే (AIADMK) అభ్యర్థిగా బరిలోకి దిగి డీఎంకే కంచుకోటను పడగొట్టారు. గత రెండు దశాబ్దాలుగా డీఎంకే ఆధిపత్యంలో ఉన్న ఈ స్థానాన్ని, లీమారోజ్ తన పట్టుదలతో కైవసం చేసుకున్నారు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థి కేపీ కృష్ణన్‌ను, డీఎంకే అభ్యర్థి పరివల్లాల్‌ను వెనక్కి నెట్టి ఆమె అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
మరోవైపు, చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గంలో మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున తన సత్తా చాటారు. నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, తన తొలి ఎన్నికల్లోనే భారీ మెజారిటీని సాధించారు. డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్‌పై సుమారు 17 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచి, పార్టీకి బలమైన పునాది వేశారు. ఒకప్పుడు డీఎంకేకు అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆధవ్ మార్టిన్ మార్క్ స్పష్టంగా కనిపించింది.
తమిళనాడులో అత్తా-అల్లుళ్లు జైత్రయాత్ర కొనసాగిస్తుండగా, పుదుచ్చేరిలో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఏ పార్టీ మద్దతు కోసం వేచి చూడకుండా, తన సొంత పార్టీ 'లట్చియ జననాయక కట్చి' (LJK) ద్వారా కామరాజ్ నగర్ బరిలోకి దిగారు. గతంలో బీజేపీలో పనిచేసిన అనుభవం ఉన్న జోస్, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిపై 10 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, సొంతంగా తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకున్నారు.
సిద్ధాంతాలు వేరైనా, పార్టీలు వేరైనా.. గెలుపు మాత్రం ఈ మార్టిన్ కుటుంబానికే సొంతమైంది. తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరి రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, వేర్వేరు పార్టీల తరపున ఒకేసారి అసెంబ్లీకి ఎన్నికవ్వడం ఒక అరుదైన రికార్డు. ఈ ఫలితాలతో దక్షిణాది రాజకీయాల్లో మార్టిన్ ఫ్యామిలీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.