దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేస్తూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఊహించని విధంగా ఇద్దరు హేమాహేమీలు ఎంకే స్టాలిన్(MK Stalin), మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవడమే కాకుండా, స్వయంగా ఎమ్మెల్యేలుగా కూడా ఓటమి పాలుకావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, అధికారం పోయినా సభలో అడుగుపెట్టి తమ గళాన్ని వినిపించేందుకు ఈ ఇద్దరు నేతలకు ఇప్పుడు ప్లాన్-బి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ నటుడు విజయ్(Vijay) నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే విజయ్ తన సత్తా చాటుతూ రెండు నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉండటంతో, అక్కడ ఉపఎన్నిక అనివార్యం కానుంది.
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. విజయ్ వదులుకోబోయే ఆ సీటు నుండి టీవీకే తరఫున నటి త్రిష(Trisha) లేదా విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ సీఎం స్టాలిన్ ఈ స్థానంపై కన్నేసినట్లు సమాచారం. తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి స్టాలిన్ ఈ ఉపఎన్నికను ఒక బంగారు అవకాశంగా భావిస్తున్నారు. ఒకవేళ ఆయన ఇక్కడి నుండి బరిలోకి దిగితే, తమిళ రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరు ఖాయం.
అటు పశ్చిమ బెంగాల్‌లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. తన మాజీ అనుచరుడు, బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన మమతా బెనర్జీ(Mamata Banerjee) ఇప్పుడు అసెంబ్లీకి వెలుపల ఉండిపోయారు. అయితే, సువేందు అధికారి రెండు చోట్ల గెలవడంతో ఆయన ఒక సీటును వదులుకోవాల్సి వస్తోంది. దీంతో అక్కడ రాబోయే ఉపఎన్నిక మమతకు ఒక లైఫ్ లైన్ లా మారబోతోంది.
తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపాలంటే దీదీ అసెంబ్లీలో ఉండటం అత్యవసరం. అందుకే పంతం పట్టి మరీ ఈ ఉపఎన్నికలో నెగ్గి, సువేందు, బీజేపీ(BJP)కి ధీటైన సమాధానం చెప్పాలని ఆమె భావిస్తున్నారు.మొత్తానికి, ఓటమి భారంతో ఉన్న ఈ ఇద్దరు అగ్రనేతలకు ఉపఎన్నికల రూపంలో ప్లాన్-బి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. మరి ఈ ఛాన్స్‌ని వారు ఎలా వాడుకుంటారో చూడాలి!