రాష్ట్రంలో అధికారం పోయి, ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత నాయకులకు ఖాళీ టైం బాగా దొరుకుతుందేమో కానీ.. వైఎస్సార్సీపీ(YSRCP) నేత అంబటి రాంబాబుకి మాత్రం నిద్ర పట్టడం లేదన్నది సుస్పష్టం. ఎందుకంటే, తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారం కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టడమే ఇప్పుడు ఆయనకు ఏకైక ఫుల్‌టైమ్ జాబ్ లా మారిపోయింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఎక్కడ చిన్న గ్యాప్ దొరికినా దాన్ని క్యాష్ చేసుకోవడాని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అస్సలు వెనకడుగు వేయడం లేదు. అందులో భాగంగానే అంబటి రాంబాబు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య సఖ్యతను దెబ్బతీసేలా అంబటి రాంబాబు వ్యూహాత్మకంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) జైకి వెళ్లిన సమయంలో జనసేన అవసరం ఎంతైనా పడిందని, కానీ ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీని కేవలం వాడుకుని వదిలేస్తున్నారనే కోణంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ ఒకలా, అధికారం చేతికి వచ్చాక మరోలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనసేన కార్యకర్తలు కేవలం ఊడిగం చేయడానికి మాత్రమే ఉన్నారా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
ఈ పొలిటికల్ డిబేట్‌లో అత్యంత హాట్ టాపిక్ ఏమిటంటే.. ఏపీ రాజకీయాల్లో కేవలం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్(Nara Lokesh) మాత్రమే నాయకులని, వేరే ప్రత్యామ్నాయం లేదంటూ అంబటి పరోక్షంగా జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను టార్గెట్ చేశారు. పవన్‌ను కూటమిలో కేవలం ఒక డమ్మీలా మార్చేశారనే విమర్శలకు బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. "జనసేనకు అసలు అధికారంలో వాటా ఎంత ఇచ్చారు? కూటమిలో ఆ పార్టీకి గౌరవం దక్కుతోందా?" అంటూ అంబటి వేసిన ప్రశ్నలు ఇప్పుడు జనసేన క్యాడర్‌లో అంతర్మథనానికి గురిచేస్తున్నాయి. టీడీపీకి అధికారం కట్టబెట్టడానికి జనసేన నేతలు భుజాన వేసుకుంటే, చివరికి వారిని పక్కన పెడుతున్నారనే వాదనను ఆయన తెరపైకి తెచ్చారు.
మొత్తానికి, అంబటి రాంబాబు(Ambati Rambabu) తాజా వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం కూటమిలో చిచ్చు పెట్టడమే అన్నది స్పష్టమవుతోంది. ఇలాంటి ప్రత్యర్థుల రెచ్చగొట్టే మాటలకు, రాజకీయ కుయుక్తులకు టీడీపీ, జనసేన పార్టీలు పావులుగా మారకూడదు. క్షేత్రస్థాయిలో ఎలాంటి చిన్నపాటి విభేదాలు తలెత్తినా వెంటనే సరిదిద్దుకుంటూ, ఇరు పార్టీల మధ్య బలమైన సమన్వయం కాపాడుకోవడం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరం. పరస్పర నమ్మకంతో కలిసికట్టుగా అడుగులు వేస్తేనే, విపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టి భవిష్యత్ రాజకీయాల్లో విజయం సాధించడం సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.