జగన్ నిర్ణయం తప్పంటున్న మాజీ ఐఏఎస్

admin
Published by Admin — May 02, 2026 in Andhra
News Image

వైసీపీ హ‌యాంలో తీసుకున్న కీల‌క నిర్ణ‌యాలు త‌ప్ప‌ని తేలుతోంది. రాజ‌కీయ దురుద్దేశం, త‌న వారికి మేలు చేసేందుకు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌తో వ్య‌వ‌స్థ‌లు గాడి త‌ప్పాయ‌ని సీఎం చంద్ర‌బాబుసైతం ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించి కూడా 2023లో తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా.. ప‌విత్ర ఆల‌యం రాజ‌కీయాల‌కు కేంద్రంగా మారింద‌ని.. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీపై విచార‌ణ చేసేందుకు నియ‌మితులైన మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ తేల్చి చెప్పారు.

తిరుమ‌ల‌ను రాజ‌కీయ కేంద్రంగా మార్చార‌ని ఆయ‌న ఆక్షేపించారు. తిరుమ‌ల‌లో ఏం చేయాల‌న్నా.. ప్ర‌త్యేకంగాపాల‌క మండ‌లి ఉంటుంది. జ‌గ‌న్ హ‌యాంలో ఈ పాల‌క మండ‌లి స్వ‌రూపం మారిపోయింది. సాధార‌ణ స‌భ్యుల‌తో పాటు.. ప్ర‌త్యేక ఆహ్వానితుల‌ను కూడా చేర్చారు. వాస్త‌వానికి పాల‌క మండ‌లిలోనే 52 మంది స‌భ్యులు ఉంటారు. ప్ర‌త్యేక ఆహ్వానితులుగా.. మ‌రో 50 మందికి పైగా దీనిలో చోటు దక్కించుకు న్నారు. దీనిని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని దినేష్ కుమార్ త‌న రిపోర్టులో స్ప‌ష్టం చేశారు.

ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియమితులైన వారికి రాజ‌కీయ ప్రమేయం ఉంద‌ని.. వారి వ‌ల్ల ఆల‌యానికి వ‌చ్చిన ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. పైగా.. ప్ర‌త్యేక ఆహ్వానితుల కార‌ణంగా.. ఆల‌య సంప‌ద‌పై ప్ర‌భావం చూపింద‌ని పేర్కొన్నారు. విమాన ఖ‌ర్చులు, ద‌ర్శ‌నాల టోకెన్లు, తిరుమ‌ల‌లో ప్ర‌త్యేక వ‌స‌తులు , సిఫార‌సుల కారణంగా తిరుమ‌లలో సాధార‌ణ భ‌క్తుల‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయ‌ని పేర్కొన్నారు. వీరంతా కేవ‌లం రాజ‌కీయ సిఫార‌సుల‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చిన వారేన‌ని తెలిపారు.

కాగా.. గ‌తంలో హైకోర్టు కూడా ఈ ప్ర‌త్యేక ఆహ్వానితుల విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తిరుమ‌ల‌ను రాజ‌కీయ శిబిరంగా మారుస్తున్నారంటూ.. 2023 డిసెంబ‌రులో వ్యాఖ్యానించిన విష‌యాన్ని దినేష్ కుమార్ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్ర‌త్యేక ఆహ్వానితులుగా ఉన్న‌వారు.. తిరుమ‌ల అభివృద్ధికిగానీ.. భ‌క్తుల సౌక‌ర్యాలు మెరుగు ప‌డేందుకు కానీ.. ఒక్క స‌ల‌హా, సూచ‌న కూడా చేయ‌లేద‌న్నారు. ఇదేస‌మ‌యంలో వారి సిఫార‌సు లేఖ‌లు మాత్రం గుట్టలు గుట్ట‌లుగా ఆల‌యానికి చేరుకున్నాయ‌ని.. త‌ద్వారా సాధార‌ణ భ‌క్తులకు స్వామి దూర‌మ‌య్యార‌ని స్ప‌ష్టం చేశారు. 

Tags
Jagan ex ias dinesh kumar blunder mistake
Recent Comments
Leave a Comment

Related News