తెలంగాణ(Telangana) రాజకీయాల్లో మల్లారెడ్డి అంటేనే ఒక బ్రాండ్. "పాలమ్మిన.. పూలమ్మిన.." అంటూ ఆయన చెప్పే డైలాగులు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాజీ మంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా తనదైన శైలిలో దూసుకుపోయే మల్లారెడ్డి, ఇప్పుడు వెండితెరపై సెన్సేషన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఓ టీవీ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాలో ఛాన్స్ వస్తే ఎగిరిగంతేస్తారు. కానీ, మల్లారెడ్డి మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో వచ్చిన విలన్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. దానికి ఆయన చెప్పిన కారణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "వేలాది మంది నా కాలేజీ విద్యార్థులు, అభిమానులు నన్ను దైవంగా చూస్తారు.. అలాంటిది సినిమాలో హీరో చేతిలో దెబ్బలు తింటూ కనిపిస్తే వాళ్లు తట్టుకోలేరు" అంటూ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు.
కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, తన జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు మల్లారెడ్డి(Malla Reddy) మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. సున్నా నుంచి కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించిన తన జర్నీని బయోపిక్ రూపంలో తీసుకురావాలని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను స్వయంగా తానే నిర్మిస్తానని, అందులో ఒక కీలక పాత్రలో కూడా కనిపిస్తానని స్పష్టం చేశారు. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ఇప్పుడు అందరిలోనూ నెలకొన్న అతిపెద్ద ప్రశ్న.. మల్లారెడ్డి(Malla Reddy) పాత్రను పోషించే ఆ స్టార్ హీరో ఎవరు? అని. దీనిపై స్పందిస్తూ, "డైరెక్టర్ ఎవరిని సూచిస్తే వారిని తీసుకుంటాం" అని మల్లారెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. సినిమా కథకు న్యాయం చేసే సత్తా ఉన్న హీరోనే తన బయోపిక్‌లో నటిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.