టీడీపీ ఎమ్మెల్యే ఇంట అరుదైన మామిడి.. కిలో రూ. 2.70 లక్షలు!

admin
Published by Admin — May 01, 2026 in Andhra
News Image

సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో బంగినపల్లి, కలెక్టర్, రసాలు వంటి రకాలను కిలో వందల్లో కొనుక్కుని లొట్టలేసుకుంటూ తింటాం. కానీ, మీరు ఇప్పుడు చూడబోయే ఈ మామిడి పండు(Mango) ధర వింటే మాత్రం కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఎందుకంటే, దీని ధర ఏకంగా లక్షల్లో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 2.70 లక్షల వరకు పలికే ఈ అరుదైన మామిడి పండు ఇప్పుడు మన విజయవాడలో కనువిందు చేస్తోంది.

విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(TDP MLA Gadde Rama Mohan)కేవలం రాజకీయాల్లోనే కాదు, ప్రకృతి ప్రేమికుడిగా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన ఇంటి ఆవరణలో ఎంతో ఆసక్తితో ఆయన ఈ అరుదైన మామిడి చెట్టును పెంచుతున్నారు. ప్రస్తుతం ఆ చెట్టుకు కాసిన ఎర్రటి మామిడి పండ్లు చూస్తుంటే.. అవి మామిడి పండ్లలా కాకుండా చెట్టుకు వేలాడుతున్న రత్నాల్లా మెరిసిపోతున్నాయి.

జపాన్‌కు చెందిన ఈ అత్యంత ఖరీదైన రకాన్ని ‘మియాజాకీ’ అని పిలుస్తారు. జపాన్ దేశస్థులు దీనిని ఎంతో గౌరవంగా ‘టయో నో తమగో’ (సూర్యుడి గుడ్డు - Egg of the Sun) అని పిలుచుకుంటారు. ఈ పండు ప్రత్యేకతల విష‌యానికి వ‌స్తే..  సాధారణ మామిడి పండ్లలా పసుపు రంగులో కాకుండా, ఇది పండినప్పుడు ముదురు ఎరుపు రంగులో మెరిసిపోతుంది. దీని రుచి ఇతర మామిడి పండ్ల కంటే ఎంతో భిన్నంగా, అత్యంత మధురంగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే అద్భుతమైన సువాసన దీని సొంతం.  ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ మామిడి పండ్లు పండించడం అంత సులభం కాదు. వీటికి ప్రత్యేకమైన వాతావరణం, అత్యంత జాగ్రత్తలు అవసరం. జపాన్‌లో వీటిని వేలం వేసినప్పుడు ఒక్కో పండు వేల రూపాయలు పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి ఉండే విపరీతమైన డిమాండ్, వీటి అరుదైన గుణాలే ధరను లక్షల్లోకి తీసుకెళ్లాయి. విదేశాల్లో ఉండే ఇలాంటి ఖరీదైన పండ్లు ఇప్పుడు మన రాష్ట్రంలో, అదీ విజయవాడ(Vijayawada)లో సాగు కావడం చూస్తుంటే ప్రకృతి ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సాగు చేస్తున్న ఈ మియాజాకీ మామిడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Tags
Miyazaki Mango Egg Of The Sun World Most Expensive Mango Vijayawada AP TDP Gadde Rama Mohan
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News