ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం దశ తిరగబోతోంది. దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాబు, కుప్పంను కేవలం ఒక నియోజకవర్గంగానే కాకుండా ఒక అంతర్జాతీయ పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కుప్పం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి తాజాగా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయంగా, అభివృద్ధి పరంగా బాబుకు పెద్ద ఊరటనిచ్చింది.
కుప్పం విమానాశ్రయం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, అభివృద్ధి పనులను అడ్డుకోవడం సాధ్యం కాదని గతంలో హైకోర్టు స్పష్టం చేయగా, తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court) కూడా అదే తీర్పును సమర్థించింది. "భూసేకరణ లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?" అంటూ పిటిషనర్లకు సుప్రీంకోర్టు చురకలు వేయడం గమనార్హం. ఈ తీర్పుతో ప్రాజెక్టుపై ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయి, నిర్మాణ పనులకు లైన్ క్లియర్ అయింది.
ఇటీవలే కుప్పంను హైగ్రేడ్ మున్సిపాలిటీగా ప్రకటించిన చంద్రబాబు, అక్కడ ఇంటికో పారిశ్రామికవేత్త అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శాంతిపురం వంటి మండలాలు సౌర విద్యుత్ వినియోగంలో రికార్డులు సృష్టిస్తుండటంతో, దేశ విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. అయితే, ప్రస్తుతం కుప్పం(Kuppam) వెళ్లాలంటే బెంగళూరు విమానాశ్రయంపై ఆధారపడాల్సి వస్తోంది. సుమారు 150 ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే, పారిశ్రామికవేత్తలకు రవాణా కష్టాలు తప్పడమే కాకుండా, స్థానికంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2025 ఏడాది చివరి నాటికే విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసి, విమానాల రాకపోకలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు ఐటీ కంపెనీలు, మరోవైపు సోలార్ ప్రాజెక్టులు, ఇప్పుడు సొంతంగా విమానాశ్రయం.. ఇవన్నీ కలిస్తే కుప్పం ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. న్యాయస్థానాల నుంచి సానుకూల తీర్పు రావడంతో, ఇక పనుల్లో వేగం పెంచి అనుకున్న సమయానికి కుప్పం గడ్డపై విమానం దించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.