కడపలో మళ్ళీ సెగలు.. కూట‌మికి త‌ల‌నొప్పిగా రెడ్డెమ్మ!

admin
Published by Admin — March 30, 2026 in Politics, Andhra
News Image

కడప పాలిటిక్స్‌లో ఎమ్మెల్యే మాధవి రెడ్డి(Kadapa MLA Madhavi Reddy) వ్య‌వ‌హార‌శైలి మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. మొన్న కలెక్టర్, నిన్న జె.సి.. ఇలా వరుసగా అధికారులతో ఆమె పెట్టుకుంటున్న పేచీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. సోమవారం జరిగిన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం పంపిణీ వేడుకలా కాకుండా, ప్రోటోకాల్ యుద్ధానికి వేదికగా మారడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ చిచ్చు రేగింది. నిబంధనల ప్రకారం ఇన్చార్జి మంత్రి సవిత తర్వాత జె.సి. అతిథి సింగ్‌(JC Athidhi Siṅgh) ను స్టేజీపైకి ఆహ్వానించారు అధికారులు. అయితే, అక్కడే అసలు కథ మొదలైంది. మంత్రి తర్వాత తన పేరు కాకుండా జె.సి. పేరు పిలవడమేంటని ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై అక్కడికక్కడే విరుచుకుపడ్డారు. దీంతో అప్పటివరకు ఉత్సాహంగా సాగిన కార్యక్రమం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన జె.సి. అతిథి సింగ్, అక్కడి నుంచి వెనుదిరగడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ ఇద్దరి మధ్య గొడవ ఈనాటిది కాదు. గత గణతంత్ర దినోత్సవం వేడుకల్లోనే వీరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆనాడు తనకు సరైన సీటు కేటాయించలేదని, కనీసం ఆహ్వానించలేదని కలెక్టర్ ముందే మాధవి రెడ్డి చిందులు తొక్కారు. అప్పట్లో అరగంట పాటు నిలబడే ఉన్న ఎమ్మెల్యే, అధికారుల వైఖరిని తప్పుబడుతూ వెళ్ళిపోయారు. నాటి నుంచి నేటి వరకు అధికారులకు, ఎమ్మెల్యేకు మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అభివృద్ధి పనుల విషయంలో కూడా ఇద్దరి మధ్య సయోధ్య లేదని, ఇది జిల్లా ప్రగతిపై ప్రభావం చూపుతోందని కడప(Kadapa) వాసులు చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. కూటమి అనుకూల మీడియా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా, వైసీపీ(YCP) సోషల్ మీడియా వింగ్ మాత్రం ఈ పాయింట్‌ను గట్టిగా వాడుకుంటోంది. అధికారులను గౌరవించని ఎమ్మెల్యే అంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్తుంటే, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే అధికారులతో ఘర్షణకు దిగడం కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. మరి వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న మాధవి రెడ్డి వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags
TDP MLA Madhavi Reddy TIDCO House Distribution JC Athidhi Siṅgh Kadapa AP Politics Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News