సాధారణంగా దొంగలు బ్యాంకులనో, నగల షాపులనో టార్గెట్ చేస్తారు. మహా అయితే లగ్జరీ కార్లను ఎత్తుకెళ్తారు. కానీ, ఈ మధ్య దొంగల టేస్ట్ మారింది. ఈ కేటుగాళ్లు ఏకంగా కిట్‌క్యాట్(KitKat) చాక్లెట్లపై కన్నేశారు. ఇటలీలో జరిగిన ఈ వింత దొంగతనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 టన్నుల బరువున్న 4,13,793 కిట్‌క్యాట్ చాక్లెట్లు నిండిన ట్రక్కును అత్యంత సినిమాటిక్ స్టైల్‌లో మాయం చేశారు.
ఈ దొంగతనం ఏదో ఆశామాషీగా జరగలేదు. దీని వెనుక పక్కా స్కెచ్ ఉంది. ఇటలీలోని నెస్‌లే ప్రొడక్షన్ యూనిట్ నుంచి పోలాండ్‌కు బయలుదేరాల్సిన ఈ షిప్‌మెంట్‌ను కొట్టేయడానికి దొంగలు నకిలీ అవతారమెత్తారు. ఫేక్ ఐడెంటిటీ కార్డులు, నకిలీ రవాణా పత్రాలతో అసలైన డ్రైవర్ రాకముందే ఫ్యాక్టరీకి చేరుకున్నారు. అక్కడి సిబ్బందిని తమ మాటలతో బురిడీ కొట్టించి, కోటిన్నర రూపాయల విలువైన చాక్లెట్ లోడ్‌తో దర్జాగా బయలుదేరారు. తీరా అసలు డ్రైవర్ వచ్చి చూసేసరికి సీన్ అర్థమై నెస్‌లే(Nestle) యాజమాన్యం అవాక్కయ్యింది.
దొంగలు చాక్లెట్లు(Chocolates) తిని పారిపోవడమే కాదు, టెక్నాలజీని కూడా వాడేశారు. ట్రక్కు ఇటలీ సరిహద్దు దాటగానే దాని జీపీఎస్ సిగ్నల్ కట్ అయిపోయింది. పోలీసులు ట్రాక్ చేయకుండా హైటెక్ జామర్లను ఉపయోగించి సిగ్నల్స్‌ను బ్లాక్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీ, జర్మనీ, పోలాండ్ పోలీసులు సంయుక్తంగా గాలిస్తున్నా, ఆ 12 టన్నుల చాక్లెట్లు ఎటుపోయాయో ఆచూకీ దొరకడం లేదు. ఈ దొంగతనం వల్ల పోలాండ్, తూర్పు యూరప్ మార్కెట్లలో కిట్‌క్యాట్ కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ భారీ నష్టంపై నెస్‌లే(Nestle) సంస్థ స్పందించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ``మేము ఎప్పుడూ కిట్‌క్యాట్‌తో ఒక ‘బ్రేక్’ తీసుకోమని చెబుతుంటాం. కానీ ఈ దొంగలు మా మాటను మరీ సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు.. అందుకే ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతో కలిసి బ్రేక్(పారిపోయారు) తీసుకున్నారు`` అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. నష్టం జరిగిన బాధలోనూ ఇంతటి హ్యూమర్ పండించడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురుస్తోంది. దొంగలకి మంచి టేస్ట్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.