సినిమా కష్టాలు వెండితెరపై చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. కానీ, అదే సినిమాలోని వికృత చేష్టలు నిజ జీవితంలో రిపీట్ అయితే? అది కూడా ఒక యువతి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేలా ఉంటే? సరిగ్గా ఇలాంటి అమానవీయ ఘటనే భాగ్యనగరం నడిబొడ్డున వెలుగుచూసింది. ఇటీవల వచ్చిన `రాజు వెడ్స్ రాంబాయి` కన్నతండ్రి పగతో హీరోయిన్‌కు ఎయిడ్స్ రక్తం ఎక్కించే సీన్ ఎంతగా వైరల్‌గా తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అదే సీన్‌ను రియల్ లైఫ్‌లో రిపీట్ చేశాడు హైదరాబాద్‌కు చెందిన ఒక కిరాతకుడు. పెళ్లి చేసుకోనన్నందుకు ఒక నిండు ప్రాణాన్ని బలి చేయాలనే వికృత ఆలోచనతో ఆమె శరీరంలోకి ప్రాణాంతక వైరస్‌ను ఇంజెక్ట్ చేశాడు.
హైదరాబాద్ శివార్లలోని పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి, బాధితురాలికి పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చయమైంది. అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో యువతికి షాకింగ్ నిజం తెలిసింది. తనకు కాబోయే భర్త మనోహర్‌కు, అతని తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ (HIV) సోకినట్లు ఆమె గుర్తించింది. తన భవిష్యత్తు నాశనమవుతుందని భావించిన ఆ యువతి, ధైర్యంగా ఈ పెళ్లిని నిరాకరించింది.
పెళ్లి ఆగిపోవడంతో మనోహర్ అహం దెబ్బతింది. తను అనుభవించే నరకాన్ని ఆమెకు కూడా రుచి చూపించాలని ఉన్మాదిలా ఆలోచించాడు. ఈ నెల 11న నేరుగా యువతి ఇంటికి వెళ్లిన మనోహర్, తననే పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఆమె ససేమిరా అనడంతో, అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న ఎయిడ్స్ రక్తం నిండిన సిరంజిని తీసి ఆమెకు బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. కళ్ల ముందే ఒక ప్రాణాంతక వ్యాధిని తన శరీరంలోకి ఎక్కించిన మనోహర్ చర్యతో ఆ యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మనోహర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడి వెనుక ఉన్న అసలు కుట్ర కోణాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.