సినిమా రంగంలో ఒడుదొడుకులు సహజం. కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్క నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. అది అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు లేదా ఊహించని నష్టాన్ని మిగిల్చవచ్చు. సరిగ్గా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు సీనియర్ నటుడు, నిర్మాత శివాజీ. ఆయన చేసిన పెద్ద పొరపాటు వల్ల ఇప్పుడు ఏకంగా రూ. 1800 కోట్ల ఆదాయం చేజారిపోయింది.
శివాజీ కేవలం నటుడిగానే కాకుండా, రియల్ ఎస్టేట్ రంగంలోనూ మంచి పట్టు ఉన్న వ్యక్తి. గతంలో ఆయన భూముల మీద భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే, హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అప్పట్లో ఆయన 18 ఎకరాల భారీ భూమిని కొనుగోలు చేశారు. కానీ, వ్యాపార లెక్కల్లో భాగంగా ఆ భూమిని కొంతకాలం తర్వాత అమ్మేశారు. అలా ఆయన అమ్మేసిన ఆ 18 ఎకరాల విలువ ఇప్పుడు అక్షరాలా రూ. 1800 కోట్లు.
తాజా ఇంటర్వ్యూలో శివాజీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రియల్ ఎస్టేట్ ద్వారా తాను ఓ మోస్తరుగా సంపాదించిన మాట వాస్తవమే అయినా.. జనాలు అనుకుంటున్నట్లు కోట్లకు కోట్లు వెనకేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తాను అమ్మేసిన భూమిని అలాగే ఉంచుకుని ఉంటే ఈ రోజు తన దగ్గర వేల కోట్లు ఉండేవి. కానీ, రియల్ ఎస్టేట్‌లో కొని అమ్మడం సహజం. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయం తీసుకున్నానని శివాజీ చెప్పుకొచ్చారు.
కెరీర్ విషయానికి వస్తే.. శివాజీ మళ్ళీ వెండితెరపై తన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటించి, నిర్మించిన ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సీనియర్ నటి లయ కీలక పాత్రలో కనిపిస్తుండటం విశేషం. మరోవైపు, అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘లెనిన్’లోనూ శివాజీ ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించారు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వ్యాపారంలో భారీ లాభాలను మిస్ చేసుకున్నా, నటుడిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం శివాజీ తన సత్తా చాటుతారని అభిమానులు ఆశిస్తున్నారు.