తగ్గేదేలే అంటున్న కొలికపూడి.. టీడీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం!

admin
Published by Admin — March 05, 2026 in Politics, Andhra
News Image

తిరువూరు రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పదేపదే వివాదాల్లో చిక్కుకోవడం, పార్టీ లైన్ దాటి ప్రవర్తించడంపై టీడీపీ అధిష్టానం ఓ స్పష్టమైన ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జిల్లా నాయకత్వంతో విభేదిస్తున్న కొలికపూడి, తాజాగా ఒక ఆలయ కార్యక్రమంలో వ్యవహరించిన తీరుతో వివాదాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు.

వెనక్కి తగ్గేదే లేదంటూ ఆయన తన దూకుడును కొనసాగిస్తుండటం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే పలుమార్లు పిలిపించి హెచ్చరించినా, వివరణలు కోరినా ఆయన వైఖరిలో మార్పు రాకపోవడంతో హైకమాండ్ ఒక సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు సమాచారం. నేరుగా చర్యలు తీసుకుంటే ఆయన రెబల్ ముద్ర వేసుకుని సానుభూతి పొందే అవకాశం ఉందని భావించిన పార్టీ పెద్దలు, ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాల‌ని నిర్ణ‌యించార‌ట‌.

కొలికపూడి విషయంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కంటే, ఆయన్ని పూర్తిగా లైట్ తీసుకోవడమే మేలని పార్టీ భావిస్తోంది. నియోజకవర్గంలో ఆయన మాట చెల్లకుండా చేయడం, అధికార యంత్రాంగానికి ఆయన ఆదేశాలను పట్టించుకోవద్దని సంకేతాలు పంపడం ద్వారా ఆయన్ని ఒంటరి చేసే ప్లాన్ అమలు జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ``చెప్పాల్సింది చెప్పాం.. ఇక పిలిచి మాట్లాడే ప్రసక్తే లేదు`` అని ఆయన అనడం ద్వారా కొలికపూడి చాప్టర్‌ను హైకమాండ్ క్లోజ్ చేసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకవేళ పార్టీ గనుక కఠిన చర్యలు తీసుకుంటే, కొలికపూడి నేరుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఆయన జిల్లా ఎంపీని, స్థానిక నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్నప్పటికీ.. చర్యలు ఉంటే మాత్రం నేరుగా చంద్రబాబు, లోకేశ్‌లను టార్గెట్ చేసే అవకాశం ఉంది. అందుకే ఆయనకు ఏ బాధ్యతలూ అప్పగించకుండా, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత తగ్గించి.. ఒక రకమైన పొలిటికల్ ఐసోలేషన్ లోకి నెట్టాలని టీడీపీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో కొలికపూడి తన పంథా మార్చుకుంటారా లేక నిజంగానే రెబల్ జెండా ఎగురవేస్తారా అన్నది చూడాలి.

Tags
Kolikapudi Srinivasa Rao TDP Andhra Pradesh Ap Politics Tiruvuru Chandrababu Naidu
Recent Comments
Leave a Comment

Related News