ఏపీలో ఇంట్రెస్టింగ్ సీన్‌: షర్మిల వైలెంట్.. జగన్ సైలెంట్‌!

admin
Published by Admin — February 18, 2026 in Politics, Andhra
News Image

ఏపీ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు ``నేను విన్నాను.. నేను ఉన్నాను`` అంటూ జనంలోనే గడిపిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మౌన ముద్రలోకి వెళ్లగా.. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్ షర్మిల మాత్రం వైలెంట్ గా జనంలోకి దూసుకుపోతున్నారు. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీ అధినేత ప్యాలెస్‌కు ప‌రిమిత‌మైతే, ఉనికి కోసం పోరాడుతున్న పార్టీ అధ్యక్షురాలు రోడ్లపై పోరాడుతుండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి షర్మిల ప్రారంభించిన `ఉపాధి హామీ రక్షణ యాత్ర` కేవలం ఒక పర్యటనలా కాకుండా, కూటమి ప్రభుత్వ లోపాలను ఎండగట్టే అస్త్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు పేద కూలీల పొట్ట కొడుతున్నాయంటూ ఆమె క్షేత్రస్థాయిలో చేస్తున్న పోరాటం గ్రామాల్లో చర్చకు దారితీస్తోంది.

మరోవైపు, 11 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదన్న అసంతృప్తితో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీని బహిష్కరించడం చర్చనీయాంశమైంది. ప్రజా సమస్యలను సభలో గట్టిగా వినిపించాల్సిన బాధ్యతను వదిలేసి, కేవలం తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రెస్ మీట్లకే పరిమితం కావడంపై సొంత పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. ప్రజల్లో ఉండాల్సిన నాయకుడు కేవలం ఎక్స్ వేదికగా ట్వీట్లకే పరిమితమైతే, క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ పడిపోతుందనే ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

అయితే జగన్ మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఢిల్లీ భయం అని షర్మిల చేస్తున్న విమర్శలు సామాన్య జనాన్ని ఆలోచింపజేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ ప్రయోజనాలే జగన్‌కు ముఖ్యమని, అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గళం విప్పడం లేదని ఆమె నేరుగా ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ వంటి సున్నితమైన అంశంపై జగన్ స్పందించకపోవడం వల్ల ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని షర్మిల చాకచక్యంగా భర్తీ చేస్తున్నారు. ఒకవేళ జగన్ ఇదే పంథాను కొనసాగిస్తూ ప్రజలకు దూరంగా ఉంటే.. అదే సమయంలో షర్మిల నిరంతరం పోరాటాలు సాగిస్తే, భవిష్యత్తులో వైఎస్సార్ అభిమానుల మద్దతు జగన్ కంటే షర్మిలకే ఎక్కువగా ఉండే అవకాశం లేక‌పోలేదు. మ‌రి ఏపీ రాజకీయాల్లో ఈ అన్న-చెల్లెళ్ల పోరు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags
AP Politics YS Sharmila YS Jagan Andhra Pradesh AP Congress YSRCP YS Family
Recent Comments
Leave a Comment

Related News