టీమ్ ఇండియా మ్యాచ్ ఉందంటే చాలు.. స్టేడియంలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఇటీవల కొలంబో వేదికగా జరిగిన భారత్-పాక్ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను చూసేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా వెళ్లారు. భారత జట్టు జెర్సీ ధరించి, జాతీయ జెండా పట్టుకుని స్టేడియంలో ఆయన సందడి చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఈ పర్యటనపై వైసీపీ అనుకూల మీడియా ఒక్కసారిగా విమర్శల దాడి మొదలుపెట్టింది. లోకేష్ తన వ్యక్తిగత విలాసాల కోసం ప్రభుత్వ సొమ్మును మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారంటూ కథనాలు వండి వార్చింది.
వైసీపీ మీడియా చేస్తున్న ప్రచారంలో ఎంత నిజముందో తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం అసలు గుట్టు బయటపెట్టింది. లోకేష్ తన కొలంబో పర్యటనకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుండి తీసుకోలేదని, అది పూర్తిగా ఆయన వ్యక్తిగత ఖర్చని స్పష్టం చేసింది. విమాన టికెట్ల నుంచి స్టేడియం పాస్ వరకు అన్నీ సొంత డబ్బులతోనే సమకూర్చుకున్నారని తేల్చడంతో, విమర్శలు చేసిన వారు ఒక్కసారిగా మౌనంలోకి వెళ్ళిపోయారు.
లోకేష్ సెటైరికల్ ఎటాక్.. సోషల్ మీడియా షేక్!
ఇక తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు లోకేష్ తనదైన శైలిలో ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. ``ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్?`` అంటూ ఘాటుగా, సెటైరికల్‌గా స్పందించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ``లోకేష్ పంచ్ అదిరింది`` అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి బురదజల్లే ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
కాగా, కొలంబోలో కేవలం మ్యాచ్ చూడటమే కాకుండా, స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతినిధి, బిసిసిఐ కార్యదర్శి జై షాతో కూడా లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రికెట్ మౌలిక సదుపాయాల కల్పనపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు పర్సనల్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నించడం గమనార్హం.