సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు సిద్దార్థ్ లొంగిపోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. అదేసమయంలో తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను పూర్తి చేయాలని కూడా పేర్కొంది. 50 వేల రూపాయల జరిమానాను 9 శాతం వడ్డీతో చెల్లించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఏం జరిగింది?
తెలంగాణకు చెందిన ప్రత్యూష, సిద్దార్థ్ రెడ్డిలు.. హైదరాబాదులో చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఇంటర్ పూర్తి చేస్తున్న సమయంలోనే ప్రత్యూషకు సినీమా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్ కోసం కాలేజీలో చేరాడు. అయితే.. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఇరు కుటుంబాల వారు.. పెళ్లికి నిరాకరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో 2002, ఫిబ్రవరి 23న వారిద్దరూ విషం తాగారు.
ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ప్రత్యూష మరణించగా.. కొన్నాళ్లకు సిద్దార్థ్ కోలుకున్నాడు. ఈ వ్యవహారంపై ప్రత్యూష కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తె ఆత్మహత్యకు సిద్దార్థే కారణమని.. ఆమెపై లైంగిక దాడి కూ డా చేశాడని ఆరోపించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి.. సుదీర్ఘకాలం తర్వాత.. కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సెషన్స్ కోర్టు.. సిద్దార్థను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్ల జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించింది.
దీనిని సిద్ధార్థ్ కుటుంబం హైకోర్టులో సవాల్ చేయగా.. జరిమానాను 50 వేలకు పెంచుతూ.. జైలు శిక్షను 2 సంవత్సరాలకు తగ్గిస్తూ.. హైకోర్టు తీర్పు చెప్పింది. అయినప్పటికీ.. ఈ తీర్పును మరోసారి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాజాగా విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు.. సిద్దార్థ్ నేరస్తుడేనని.. హైకోర్టు విధించిన శిక్షను అమలు చేయాల్సిందేనని తీర్పు వెలువరించింది. ప్రస్తుతం సిద్దార్థ్.. బెయిల్‌పై ఉన్నాడు.