పాకిస్థాన్‌కు సినిమా మామూలుగా ఉండదు

admin
Published by Admin — February 03, 2026 in International
News Image

ఇండియా, పాకిస్థాన్ జట్లు క్రికెట్లో తలపడుతుంటే ఆ మ్యాచ్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్లో ఉండే ఆసక్తే వేరు. ఒకప్పటితో పోలిస్తే ఈ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగకపోయినా, భారత జట్టు ఆధిపత్యం అవుతున్నా.. ఈ మ్యాచ్ అంటే అందరూ టీవీల ముందు కూలబడిపోతారు. ఐతే ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో ఆగిపోయిన నేపథ్యంలో ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీల్లో లేదా ఆసియా కప్‌లో మాత్రమే తలపడుతున్నాయి. 

కానీ ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకోవడంతో క్రికెట్ అభిమానులకు నిరాశ తప్పలేదు. అదే సమయంలో మెజారిటీ ఇండియాన్స్ పాక్‌తో ఆడాల్సిన అవసరం లేదని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంతో ఇండియాను భలేగా దెబ్బ కొట్టామని పాకిస్థానీలు సంబరపడిపోతున్నారు.

కానీ టోర్నీ ఇంకో వారంలో మొదలు కాబోతుండగా.. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా పాకిస్థాన్ ఎదుర్కోయే పరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. కొన్నేళ్లలో ఆ దేశ క్రికెట్ బోర్డు దివాళా తీసినా ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ ఇండియన్ టీంతో ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో వేల కోట్ల ఆదాయం కోల్పోయింది పాకిస్థాన్. మిగతా విదేశీ జట్లు కూడా ఆ దేశానికి చాలా ఏళ్ల పాటు వెళ్లలేదు. ఎప్పుడో ఒక సిరీస్ జరుగుతోంది అంతే. దీంతో ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ చేయడం ద్వారా ఆ దేశ క్రికెట్ బోర్డుకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. 

ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీ రూ.2 వేల కోట్లకు పైగా నష్టపోతుంది. బ్రాడ్‌కాస్టర్‌కు రూ.300 కోట్లకు పైగానే వెనక్కి ఇవ్వాల్సి వచ్చేలా ఉంది. సరైన కారణం లేకుండా, టోర్నీ కొన్ని రోజుల్లో ఆరంభం కాబోతుండగా ఇండియాతో మ్యాచ్ నుంచి తప్పుకోవడం వల్ల పాకిస్థాన్ నుంచే ఈ మొత్తాన్ని ఐసీసీ రికవర్ చేసే అవకాశముంది. టోర్నీ ద్వారా పాక్‌కు ఇవ్వాల్సిన ఆదాయ వాటాను ఆపేయడం, వార్షిక ఆదాయంలోనూ కోత పెట్టడం లాంటి చర్యలను ఐసీసీ చేపట్టవచ్చు. 

అంతే కాక ఇకపై భారత్.. ఆసియా కప్‌లో ఆడదు. ఇతర విదేశీ జట్లు పాకిస్థాన్‌‌కు వెళ్లకుండా బీసీసీఐ తెర వెనుక చక్రం తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుకు మున్ముందు ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదురవడం ఖాయం. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలన్న డిమాండుకు ఒప్పుకోనందుకు బంగ్లాదేశ్‌ ఈ టోర్నీ నుంచి వైదొలగగా.. ఆ దేశానికి మద్దతుగా నిలిచే క్రమంలో పాకిస్థాన్ తన కొంపకు నిప్పు పెట్టుకున్నట్లే ఉంది పరిస్థితి.

Tags
Pakistan cricket team t20 world cup consequences
Recent Comments
Leave a Comment

Related News