సోషల్ మీడియాలో ఈ టైప్ పోస్టులతో టీడీపీకి నష్టమే!

admin
Published by Admin — February 03, 2026 in Politics
News Image

ఏపీ రాజకీయాలు ఏ దిశగా వెళుతున్నాయి. ఫ్యాక్షన్ సినిమాలను తలపించేలా పార్టీల మధ్య విభేదాలు వ్యక్తిగత కక్షల స్థాయిని దాటేసిన తీరు చూస్తే.. రాబోయే రోజుల్లో ఆంధ్రారాజకీయాలు మరింత హింసాత్మకంగా మారతాయా? అన్నది ప్రశ్నగా మారకమానదు. ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకోవటం.. ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవటం.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే..ప్రత్యర్థుల రక్తం ఉడికిపోయేలా ఉండటం.. వీటిని ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా ప్రోత్సహించటమే తప్పించి.. ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పెట్టాలన్న ధ్యాస ఏ కోశాన లేని తీరు చూస్తే షాకింగ్ గా ఉంటాయని చెప్పాలి.

తిరుమల లడ్డూలో వినియోగించిన కల్తీ నెయ్యి ఎపిసోడ్ కు సంబంధించి ఇటీవల సిట్ రిపోర్టు ఇవ్వటం.. అందులో జంతు కొవ్వు లేదన్న రిపోర్టు ఇచ్చిందంటూ వైసీపీ ప్రచారం చేస్తూ.. కూటమి నేతలు దుర్మార్గ ప్రచారానికి పాల్పడినట్లుగా పేర్కొనటం తెలిసిందే. అయితే.. లడ్డూలో వాడింది జంతు కొవ్వా? లేదా? అన్న విషయాన్ని సూటిగా.. స్పష్టంగా తెలపకున్నా.. అసలు వాడింది నెయ్యే కాదు.. కెమికల్ నూనె అన్న వాస్తవాన్ని వివరంగా చెప్పింది. అయితే.. వైసీపీ వర్గాలు మాత్రం తమకు కావాల్సిన పాయింట్ ను హైలెట్ చేస్తున్నారే తప్పించి.. అదే సిట్ లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి.. నెయ్యే కాదని.. అది కెమికల్ ఆయిల్ అన్న విషయాన్ని పట్టనట్లుగా వదిలేసిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. వైసీపీ తీరును తప్పు పడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. అలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద ఆగి..దానిని తొలగించే ప్రయత్నం చేశారు అంబటి. అయితే.. ఈ తీరును టీడీపీ వర్గాలు అడ్డుకోవటం.. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణ హద్దులు దాటేయటం తెలిసిందే. తన కారుపై దాడి చేసేందుకు వస్తున్న వారిపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన అంబటి.. బండ బూతులు తిట్టటమే కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన తర్వాత.. అనుకోకుండా తన నోటి నుంచి ఆ మాటలు వచ్చాయే తప్పించి.. తన ఉద్దేశం ఎంత మాత్రం అలాంటిది లేదని పేర్కొనటం తెలిసిందే.

ఈ ఉదంతం తర్వాత అంబటిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కొందరు చెలరేగిపోతున్నారు. వెనకాముందు చూసుకోకుండా తమ ఖాతాల్లో పెడుతున్న పోస్టులు కొత్త అలజడికి కారణమైన పరిస్థితి. తాజాగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తగా చెప్పే స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరి పెట్టిన పోస్టులు ఇష్టారాజ్యంగా ఉండటమే కాదు.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ హింసకు మరంత పురిగొలిపేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ ఆమె పెట్టిన పోస్టు ఏంటి? దాని సారాంశం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

జిల్లా వైసీపీ అధ్యక్ష్యుడు వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు ఇంటిపై శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్థరాత్రి పదకొండుకు గంటల వరకు జరిగిన విధ్వంసకాండలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు కీలకమని పేర్కొన్నారు. అంతేకాదు.. వైసీపీ వాళ్లు రామచంద్రరావును ఏదో చేస్తామని ఆయన ఫోటోను సేవ్ చేసుకుంటున్నారన్న ఆమె... ‘‘మీరు అనుకున్నట్లుగా ఆయన వ్యక్తి కాదురా.. కనపడని శక్తి. గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడే అడుగుపెట్టాడు. ఆయన దగ్గరకు వెళ్లాలంటే చాలా సైన్యాన్ని దాటుకొని వెళ్లాలి’’ అంటూ పోస్టు పెట్టారు.

ఇలాంటి పోస్టులు ఇప్పటికైతే బాగుంటాయి కానీ దీర్ఘకాలంలో దారుణ రాజకీయ ఉద్దేశాలకు.. విద్వేషాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయన్నఆందోళన వ్యక్తమవుతోంది. ఎంత అభిమానం ఉన్నప్పటికి దాన్ని గుట్టుగా దాచుకోవాలే తప్పించి సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం ద్వారా రాష్ట్రంలో రాజకీయాలు అంతకంతకూ దిగజారేలా ప్రవర్తించటం గమనార్హం. ఇలాంటి తీరుకు చెక్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార కూటమి సర్కారు ఈ తీరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags
Tdp social media posts damage
Recent Comments
Leave a Comment

Related News