శ్రీవారికి విరాళంగా 121 కిలోల బంగారం.. ఎవరీ భక్తుడు.?

admin
Published by Admin — November 26, 2026 in Andhra
News Image

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు మొక్కుల రూపంలో కానుకలు సమర్పించుకోవడం ఆనవాయితీ. అయితే, తాజాగా ఓ భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా అందించేందుకు ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమక్షంలో జరగనున్న ఈ మహోన్నత ఘట్టంలో, ఆ దేవదేవుడి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే మొత్తం 46 రకాల స్వర్ణాభరణాలను స్వామివారికి సమర్పించనున్నారు. ఇంతటి భారీ విరాళాన్ని అందిస్తున్న ఆ అపర కుబేరుడు, మహా భక్తుడు చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్.

వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వర్ధమాన్ జైన్(Vardhaman Jain), హెల్త్‌కేర్ టెక్నాలజీ, బీపీఓ రంగాల్లో దిగ్గజంగా పేరొందారు. ప్రస్తుతం యాక్సెస్ హెల్త్‌కేర్ సంస్థకు వ్యవస్థాపకుడిగా, వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన, గతంలో డెల్ సర్వీసెస్ వంటి అంతర్జాతీయ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, మెడికల్ కోడింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో సొంత పేటెంట్లను సాధించిన మేధావిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. విజన్ హెల్త్‌సోర్స్, ఆసియా ఇంజనీరింగ్ వంటి సంస్థల అభివృద్ధిలోనూ ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారు.

సంపాదించిన సంపదను సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయడంలో వర్ధమాన్ జైన్ ఎప్పుడూ ముందుంటారు. శ్రీ సరితా జైన్ ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్య, వైద్య సేవలను అందిస్తూనే, 'ఆవిష్కార్' సంస్థ ద్వారా నిరుపేద యువతకు ఉపాధి కల్పించే నైపుణ్య శిక్షణను ఇప్పిస్తున్నారు. అలాగే చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ ఎందరో చిన్నారుల ప్రాణాలను కాపాడటంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

తిరుమల శ్రీవారి పట్ల వర్ధమాన్ జైన్‌కు ఉన్న భక్తి ఈనాటిది కాదు. 2019 నుంచి ఆయన నిరంతరాయంగా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నారు. గతంలో ఎస్వీబీసీ ఛానల్ అభివృద్ధికి రూ. 7 కోట్లు, గోశాలలో పశుగ్రాసం తయారీ కోసం రూ. 5 కోట్ల విలువైన మిక్సింగ్ ప్లాంట్‌ను విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం కోటి రూపాయల విలువైన కాయిన్స్ మెషిన్, పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సులతో పాటు చెన్నైలోని టీటీడీ ఆలయానికి కూడా భారీగా విరాళాలు సమర్పించారు. వ్యాపార దక్షతతో పాటు సేవాగుణం, దైవభక్తి కలగలిసిన వ్యక్తిత్వమే వర్ధమాన్ జైన్‌ను నేడు తిరుమల(Tirupati) చరిత్రలో నిలిచిపోయే దాతగా మార్చింది.

Tags
Vardhaman Jain Tirumala Donation 121 Kg Gold Donation Tirupati TTD Lord Venkateswara CM Chandrababu Naidu
Recent Comments
Leave a Comment

Related News