ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో సార్వత్రిక ఎన్నికల దుమ్ము ఇంకా పూర్తిగారక ముందే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కట్టబెట్టిన ప్రజలు, రెండున్నరేళ్ల పాలన తర్వాత జరిగిన లోకల్ బాడీ పోరులోనూ కూటమి వైపే నిలవడం ద్వారా తమ రాజకీయ పంథాను మరోసారి స్పష్టం చేశారు. కేవలం ఎమ్మెల్యేల ఎంపికే కాకుండా, గ్రామ, వార్డు స్థాయిల్లోనూ అధికార పక్షానికి పూర్తిస్థాయిలో పట్టం కట్టడం ద్వారా స్థానిక రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. మరి ఈ లోకల్ వార్ అసలు ఎవరికి ఎంత మేలు చేసింది? ఏ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది? క్షేత్రస్థాయి సమీకరణాలు ఏం చెబుతున్నాయి?
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో కొంత వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతాన్ని కూటమి మరింత పెంచుకోవడం విశేషం. అధికారిక గణాంకాల ప్రకారం, స్థానిక ఎన్నికల్లో(AP Local Elections) కూటమికి ఏకంగా 58.9 శాతం ఓట్లు రాగా, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి 33.56 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కూటమి ఓట్ల శాతం 3.6 శాతం పెరిగితే, వైసీపీ ఓట్ల శాతం ఏకంగా 6.25 శాతం పడిపోయింది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 25.34 శాతంగా ఉండటం కూటమికి ఉన్న తిరుగులేని ప్రజా మద్దతును అద్దం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లోనూ 59.09 శాతం ఓట్లతో కూటమి తన ప్రభావాన్ని చాటుకుంది.
స్థానాల పరంగా చూస్తే ఈ విజయం మరింత స్పష్టమవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 659 జడ్పీటీసీ(ZPTC) స్థానాల్లో కూటమి ఏకంగా 575 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. అలాగే 9,818 ఎంపీటీసీ స్థానాలకు గాను 7,803 చోట్ల కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగించారు. ఏకంగా 90 శాతం మండల అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా గ్రామస్థాయిలో పార్టీ పట్టు ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. మొత్తం 28 జిల్లాల్లో 27 చోట్ల కూటమి క్లీన్ స్వీప్ చేయడం సంచలనంగా మారింది.
మరోవైపు, ప్రతిపక్ష వైసీపీకి ఈ ఫలితాలు మింగుడుపడడం లేదు. గతంలో తిరుగులేని ఆధిక్యత చాటుకున్న కొన్ని కంచుకోటలు సైతం ఈ లోకల్ వార్‌లో కరిగిపోయాయి. ఇన్నాళ్లుగా తమకు తిరుగులేదని భావించిన మార్కాపురం లాంటి ప్రాంతాల్లో ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడం ఆ పార్టీ క్యాడర్‌ను తీవ్ర నిరాశలోకి నెట్టింది. అనకాపల్లి, కోనసీమ, పల్నాడు, విశాఖ(Vishaka) వంటి కీలక జిల్లాల్లోనూ ఖాతా తెరవలేకపోవడం వైసీపీ వ్యూహాల వైఫల్యానికి అద్దం పడుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ న్యాయపోరాటాలు చేయడం, ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం వంటి పరిణామాలు ప్రజల్లో నెగెటివ్‌గా మారాయని, ఫలితంగానే ఓట్ల శాతం భారీగా పడిపోయిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం ఓటింగ్ సరళి. గతంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తంచేసిన పార్టీలకు, ఇప్పుడు బ్యాలెట్ పేపర్ విధానంలోనూ అదే ఫలితాలు రావడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్లలోనూ కూటమి ఏకపక్షంగా మెజారిటీ సాధించడం ప్రభుత్వానికి ఉద్యోగవర్గాల నుంచి కూడా మద్దతుందనే సంకేతాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు చేయడం కంటే, క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ప్రతిపక్షానికి వచ్చిందని ఈ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.మొత్తానికి చూస్తే, ఈ లోకల్ వార్‌లో రాజకీయంగా లాభపడింది మాత్రం స్పష్టంగా కూటమే. అధికారంలోకి వచ్చిన ఊపును గ్రామస్థాయి వరకు బదిలీ చేయడంలో సఫలమవ్వగా, వైసీపీ(YCP) మాత్రం తన పాత కోటలను కాపాడుకోలేక చవిచూసిన ఓటమితో ఆత్మపరిశీలనలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.