వైసీపీ విధ్వంసాల‌ను బ‌లంగా ఎదుర్కొన్నాం: ప‌వ‌న్‌

admin
Published by Admin — October 27, 2026 in Politics
News Image

2019-24 మ‌ధ్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ చేసిన విధ్వంసాల‌ను తాము బ‌లంగా ఎదుర్కొనాల్సి వ‌చ్చింద ని డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ఆర్థికంగా అప్పులు చేసినా.. సామాజికంగా కులాల మ‌ధ్య చిచ్చు పెట్టినా.. అభివృద్ధిని అట‌కెక్కించినా.. వైసీపీకే చెల్లింద‌ని విమ‌ర్శించారు. అలాంటి ప‌రిస్థితిలో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి.. ప్ర‌జ‌ల అభిమానాన్ని ద‌క్కించుకుని.. వారికి సేవ చేయ‌డంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంద‌ని తెలిపారు.

వైసీపీ చేసిన అప్పుల కార‌ణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ కత్వంలో బలంగా ముందుకు తీసుకెళ్లామ‌న్నారు. ఎన్నో సవాళ్లని సమర్థంగా ఎదుర్కొన్నామ‌ని ప‌వ‌న్ చెప్పారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసినప్పుడు కూడా దేశానికి వస్తున్న 100 శాతం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 25 శాతం తీసుకెళ్తోందని చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. పెట్టుబడులకు సానుకూలమైన పరిస్థితి కల్పించిన పాలనను అభినందించారని తెలిపారు.

రాష్ట్రంలో చాలా విభిన్నమైన పరిస్థితులు వచ్చాయని, వాటిని సానుకూలంగా చర్చించి ఇప్పుడు ఏకాభిప్రాయంతో ఎన్నికలకు వెళ్తున్నామ‌ని ప‌వ‌న్ వివ‌రించారు. కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా కిందిస్థాయి లో ఇదే స్ఫూర్తి, ఐక్యతను చాటాలన్నారు. బలమైన పునాదులను స్థానిక సంస్థల్లో వేయాల్సిన అవసరం ఉంద‌న్నారు. కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాత పల్లె పండుగ కార్యక్రమం కింద రూ.20,390 వేల కోట్లతో 16 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 19,500 కిలోమీటర్ల బీటీ రోడ్లతో పాటు , మినీ గోకులాలు, నీటి గుంటలు, పశువుల నీటి తొట్టెలు వంటి పనులు చేయగలిగామ‌న్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల ద్వారా రూ. 1.50 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ⁠గత వైసీపీ ప్రభుత్వంలో పెండింగ్ లో రూ.30 వేల కోట్లను నిధులను చెల్లిస్తున్నామ‌న్నారు. పేదలకు 60 వేల ఇంటి పట్టాలను ఇచ్చామ‌ని, రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు వచ్చాయని వివ‌రించారు. పోలవరం, హంద్రీనీవా, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లగలిగామ‌న్నారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకుంద‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌లు స‌రైన తీర్పు ఇవ్వ‌డం ద్వారా అభివృద్ధిని కొన‌సాగించాల‌ని ఆయ‌న సూచించారు. 

Tags
Ap deputy cm pawan slams ycp regime jagan
Recent Comments
Leave a Comment

Related News