రాజకీయాల్లో మాటలకూ, చేతలకూ మధ్య ఉండే దూరం ఎంత ఉంటుందో చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. ఎన్నికల వేళ ప్రత్యర్థులపై విరుచుకుపడటం, హెచ్చరికలు జారీ చేయడం రాజకీయ నాయకులకు సాధారణమే. కానీ, స్వయంగా అధినేత పెట్టిన రూల్స్ సొంత పార్టీలోనే బేఖాతర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) పరిస్థితి సరిగ్గా అలాగే తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని ఆయన గతంలో గట్టిగానే హెచ్చరించారు. మరి ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆ నిబంధనను గాలికి వదిలేస్తే, జగన్ తన మాటపై నిలబడతారా? లేక ఎప్పటిలాగే సైలెంట్ అయిపోతారా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, రోజా లాంటి ఉద్దండ నాయకులున్న జిల్లాలతో పాటు, స్వయంగా జగన్ సొంత జిల్లా అయిన కడపలోనూ ఏకగ్రీవాలు జరగడం విశేషం. కడపలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో ఏకంగా ఆరు చోట్ల ఏకగ్రీవాలు జరగగా, వాటిలో టీడీపీ, బీజేపీ ఖాతాలోనూ సీట్లు చేరాయి. ఒకప్పుడు ప్రత్యర్థులు కన్నెత్తి చూడలేని కడప(Kadapa) గడ్డపైనే కూటమి పాగా వేస్తుండటం, చివరకు జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోనూ వైసీపీకి చుక్కెదురయ్యేలా పరిస్థితులు మారడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. నవంబర్ 1న జరగనున్న కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి గనుక విజయం సాధిస్తే, అది కేవలం ఒక మున్సిపాలిటీతో ఆగదు... వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న బలమైన కోట బద్దలైనట్టే లెక్క.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. "మాట తప్పను, మడమ తిప్పను" అని పదే పదే చెప్పుకునే జగన్(Jagan).. ఏకగ్రీవాలకు బాధ్యులైన ఆ సీనియర్ నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటారా? కనీసం రాబోయే ఎన్నికల్లో వారి టికెట్లు రద్దు చేస్తారా? అదీకాక, స్వయంగా తన సొంత నియోజకవర్గమైన పులివెందుల బాధ్యతలకూ ఈ రూల్ వర్తింపజేసి, అక్కడ వేరే వాళ్లకు టికెట్ ఇస్తారా? అంటే... 'అది ఎప్పటికీ జరగదు' అని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్యులకు కూడా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని కాపాడుకోవడానికి సీనియర్ల అండ తప్పనిసరి అయిన తరుణంలో, వారిపై వేటు వేసే సాహసం జగన్ చేయలేరనేది బహిరంగ రహస్యం.
అయితే, ఎన్నికలకు ముందే ఓటమికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకోవడం వైసీపీకి కొత్తేం కాదు. రేపు ఫలితాలు వ్యతిరేకంగా వస్తే దానికి బలమైన కారణాలు వెతికి పట్టుకోవడం, ఆ ఓటమి భారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఖాతాలో వేయడం, ప్రజలు ఇప్పటికీ తమ వెంటే ఉన్నారని చెప్పుకోవడం ఆ పార్టీకి పరిపాటే. ఏ ఎన్నికల్లో ఓడిపోయినా, చివరికి తమదే నైతిక విజయం అనిపించుకోవడంలో ఆ పార్టీ వ్యూహమే వేరు. కానీ, క్షేత్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, సొంత గడ్డపైనే పెరుగుతున్న వ్యతిరేకత జగన్‌కు నిద్రలేకుండా చేస్తున్నాయి. మరి హెచ్చరికలు చేసి ఇరుకున పడ్డ జగన్, ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారు? ఏకగ్రీవాల లొల్లిని ఎలా కవర్ చేస్తారనేది వేచి చూడాలి.