గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా, కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎం. అబ్దుల్ గఫూర్ గారి కుమారుడు కిరణ్ వెంకట పల్లా (42) అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో శ్రీ ఎం. అబ్దుల్ గఫూర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
కిరణ్ వెంకట పల్లా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్‌జోస్‌లో పేపాల్ (PayPal) సంస్థలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని డాక్టర్ రాజా తెలిపారు.
సోమవారం సెలవు కారణంగా శాంటా క్లారా కౌంటీ అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని మంగళవారం జారీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో, కిరణ్ వెంకట పల్లా పాస్‌పోర్టు కోసం ఆయన నివాసంలో వెతుకుతున్నారని, పాస్‌పోర్టు లభించని పక్షంలో భారత కాన్సులేట్ ద్వారా అత్యవసర ప్రయాణ పత్రాన్ని పొందేందుకు అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు.
కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ఉన్న Berge-Pappas-Smith Chapel of the Angels సంస్థ ద్వారా అవసరమైన అధికారిక లాంఛనాలను పూర్తి చేసి, భౌతికకాయాన్ని విమాన కార్గో ద్వారా భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్ రాజా తెలిపారు. అవసరమైన పత్రాలు, అనుమతుల ప్రక్రియ పూర్తికావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో ఎన్నారై టీడీపీ, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు భక్త బల్లా, శ్రీకాంత్ దొడ్డపనేని, వెంకట్ అడుసుమల్లి, హరి సనిధి, అబ్దుల్ ఖుద్దూస్, ఫహాద్, సాయి బొల్లినేని, నహాస్ అలీ,కిరణ్ కొత్తపల్లి తదితరులు చురుకుగా పాల్గొంటూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని డాక్టర్ రాజా తెలిపారు.
కిరణ్ వెంకట పల్లా భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించడంతో పాటు, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.