పవన్‌కు హ్యాండ్.. మళ్లీ వైసీపీ గూటికి బాలినేని.?

admin
Published by Admin — October 01, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా, కొందరు నేతల మైండ్ సెట్ మాత్రం ఇంకా మారలేదనే చర్చ జోరుగా సాగుతోంది. ఇందులో ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అయిన సీనియర్ నేతలు, ఇప్పుడు అక్కడ సర్దుకుపోలేక సతమత‌వుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

తాజాగా వస్తున్న కథనాల ప్రకారం.. జనసేన పార్టీలో చేరిన సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivasa Reddy) భవిష్యత్తు అడుగుల మీద తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కూటమి పొత్తులో భాగంగా జనసేన కండువా కప్పుకున్న బాలినేని, ఆ పార్టీ సిద్ధాంతాలకు, అక్కడి స్థానిక సమీకరణాలకు ఏమాత్రం సర్దుకుపోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్‌సీపీ వీడి, పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు, ఆ పార్టీలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కడంలేదనే అసంతృప్తి కూడా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఒంగోలు రాజకీయాలు బాలినేని ఎంట్రీతో పూర్తిగా వేడెక్కాయి. బాలినేనికి, స్థానిక టీడీపీ(TDP) ఎమ్మెల్యే దామిచర్ల జనార్ధన రావుకు మధ్య ఉన్న రాజకీయ వైరం అంద‌రికీ తెలిసిందే. దశాబ్దాలుగా నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డ ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే కూటమిలో ఉండటం మింగుడుపడటం లేదు. జనసేనలోకి వచ్చినప్పటికీ స్థానిక టీడీపీ క్యాడర్ నుంచి ఆయనకు కనీస సహకారం అందకపోగా, ఇరువర్గాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. అధిష్టానాలు జోక్యం చేసుకుని ప్రస్తుతానికి సర్దిచెప్పినప్పటికీ, గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే బాలినేని మనసు మళ్లీ వైసీపీ వైపు మళ్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేనలో ఉక్కబోత భరించలేక, తన సీనియారిటీకి తగిన గుర్తింపు లేకపోవడంతో ఆయన తిరిగి జ‌గ‌న్ చెంత చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. తాను పార్టీ మారడానికి దారితీసిన పరిస్థితులను, అప్పట్లో జరిగిన పరిణామాలను అధినేత జగన్‌కు వివరించి మళ్లీ సొంత గూటికి చేరాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ఊహాగానాలు నిజమైతే మాత్రం, ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు, కూటమికి పెద్ద షాక్ అనే చెప్పాలి.

Tags
Balineni Srinivasa Reddy YSRCP JanaSena Ongole Politics AP Politics Andhra Pradesh AP News YS Jagan
Recent Comments
Leave a Comment

Related News