టీచ‌ర్‌పై దాడి.. మ‌రో వివాదంలో ఎమ్మెల్యే కొలిక‌‌పూడి..!

admin
Published by Admin — September 30, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapudi Srinivasa Rao) వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఆయన తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యూహమవుతున్నాయి. తాజాగా, ఓ ప్రభుత్వ పాఠశాల పీఈటీ టీచర్‌పై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారనే తీవ్ర ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య నేరుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది.

అసలేం జరిగిందంటే..?
తిరువూరు(Tiruvuru) నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేట మండలం నరసాపురం జెడ్పీ హైస్కూల్‌లో మేరుగు రమేష్ పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆ ఉపాధ్యాయుడిని తన ఇంటికి పిలిపించుకున్నారు. అయితే ఇటీవల పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలకు స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం అందించకుండా, ఒక స్థానిక టీడీపీ నేతను ముఖ్య అతిథిగా ఆహ్వానించారట. ఈ విషయమే ఎమ్మెల్యే ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ కోపంతోనే పీఈటీ రమేష్‌ను, అదే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని (HM) తన ఇంటికి రప్పించుకున్న కొలికపూడి శ్రీనివాసరావు వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పీఈటీ రమేష్‌ను, అలాగే అదే వర్గానికి చెందిన హెచ్‌ఎంను ఎమ్మెల్యే తీవ్రంగా దుర్భాషలాడారని, అంతేకాకుండా టీచర్ రమేష్‌పై కర్రతో దాడి చేశారని పోతుల బాలకోటయ్య తన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఉపాధ్యాయుల పట్ల ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదని, దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర ప్రతిష్టాభంగం కలుగుతోందని బాలకోటయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఘటనపై స్పందించి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. 

మరోవైపు ఈ ఆరోపణలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పూర్తిగా ఖండిస్తున్నారు. పాఠశాలలో విపరీతమైన ఆటల మోజు వల్ల విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో సగానికి పైగా విద్యార్థులు ఫెయిల్ కావడానికి పీఈటీ వ్యవహారశైలే కారణమని ఆయన వాదిస్తున్నారు. పాఠశాలల ప్రగతి, విద్యార్థుల భవిష్యత్తు గురించి చర్చించేందుకే విద్యాశాఖ అధికారుల సమక్షంలో వారితో మాట్లాడానని, తాను ఎవరిని కొట్టలేదని, కేవలం గట్టిగా హెచ్చరించి పంపానని ఆయన స్పష్టం చేశారు. కాగా, గతంలోనూ పలు విషయాల్లో వివాదాల్లో నిలిచిన కొలికపూడి, ఈ తాజా టీచర్ ఎపిసోడ్‌తో మరోసారి ఇరుకున పడ్డారు. మరి ఈ ఫిర్యాదుపై టీడీపీ(TDP) అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.

Tags
Kolikapudi Srinivasa Rao Tiruvuru MLA TDP Andhra Pradesh AP Politics AP News Teacher Controversy
Recent Comments
Leave a Comment

Related News