దంచికొట్టిన వానతో విశాఖ వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 గంటల వ్యవధిలో ఏకంగా 27.7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం విశాఖను ఉతికేసింది. దీంతో.. ఉక్కునగరం వణికింది. వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం బుధవారం ఉదయం 8.30 గంటలకు మొదలైన వర్షం గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతానికి 27.7 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం వర్షతీవ్రత తగ్గి.. చిన్నపాటి జల్లులు మాత్రం కురవటం అంతో ఇంతో రిలీఫ్ ఇచ్చే అంశంగా చెప్పాలి.అధికారిక నివేదికల ప్రకారం గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల ప్రాంతానికి కేవలం 1.4 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది.
బుధవారం కురిసిన రాక్షస వానతో విశాఖ చెంతనే ఉండే సముద్రం.. నగరంలోకి వచ్చి తిష్ట వేసిందా? అన్నట్లుగా జలమయమైన పరిస్థితి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా బుధవారం ఉదయం విశాఖలో ఒక మోస్తరు వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. రాత్రి వేళకు తీవ్రమైన ఈదురుగాలులతో అత్యంత భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. బుధవారం రాత్రి పెరిగిన వాన.. గురువారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉంది. దీంతో.. విశాఖ మొత్తం వాన నీటితో చెరువు మాదిరి మారిపోయింది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. బుధవారం రాత్రి మాత్రం తీవ్రమైన ఈదురు గాలులతో విశాఖ వాసులకు మరోసారి హుదూద్ తుపాన్ గుర్తుకు వచ్చి హడలిపోయారు.
భారీ వర్షాల కారణంగా సీతాకొండ ప్రాంతంలోని కొండ చరియలు విరిగిపడటంతో పాటు మట్టి.. శిథిలాలు రోడ్లపైకి కొట్టుకు వచ్చాయి. సింహాచలం కొండలపై వరదనీరు జలపాతాల మాదిరి ప్రవహించింది. దీంతో గంభీపురం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండిపోయింది. లక్కీగా ఈదురుగాలుల తీవ్రత హుదూద్ తో పోలిస్తే సగం కూడా లేకపోవటంతో భారీ ఆస్తినష్టం త్రుటిలో తప్పింది.విశాఖలోని ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా నగరం మొత్తం వర్ష తీవ్రత ఒకేలా ఉండటం గమనార్హం.
ఈ కారణంతో నగరంలోని గాజువాక.. మధురవాడ.. వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతుల్లోకి వర్షపు నీరుతో నిండిపోయాయఇ. దీంతో.. కొన్ని అపార్టుమెంట్లలోకి వర్షపు నీరు చేరటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.జాతీయ రహదారులపై నీరు నిలవటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈదురుగాలుల కారణంగా విశాఖ వ్యాప్తంగా వందలాది చెట్లు.. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రైవేటు ఆస్తులకు పెద్దగా నష్టం వాటిల్లలేదంటున్నారు.
ఈ భారీ వర్షం వేళలో విశాఖ వాసులు 2014 అక్టోబరులో వచ్చిన హుదూద్ తుపాన్ ను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో గంటకు 185-200 కి.మీ. వేగంతో వీచిన రాక్షస గాలులకు నగరంలో భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఆ రోజున విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 38సెం.మీ. వర్షపాతం నమోదైంది. కాకుంటే.. విశాఖ చరిత్రలో సెప్టెంబరులో 27.7సెం.మీ. వర్షపాతం నమోదు కావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గురువారం వర్ష తీవ్రత తగ్గినప్పటికి.. వాతావరణ శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఈ కారణంగా.. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షం కారణంగా విమానసర్వీసులకు ఆటంకం వాటిల్లింది. పలువురు తాము ప్రయాణించాల్సిన సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేదు. కొన్ని సర్వీసుల్ని రద్దు చేశారు.
మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం రాత్రి వేళలో గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ లోకి వర్షపు నీరు భారీగా చేరుకుంది. దీంతో అక్కడి ర్యాంపులన్నీ నిండిపోయాయి. ఈ కారణంతో పెట్రో ఉత్పత్తుల ఫిల్లింగ్.. రవాణా నిలిచిపోయింది. గురువారం రాత్రి వేళకు ఒక్క గాజువాకలో సుమారు 15 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లుగా చెబుతున్నారు. మొత్తంగా సైలెంట్ గా విరుచుకుపడిన వాన విశాఖ వాసులకు ప్రకృతి వయలెన్స్ ఎంతలా ఉంటుందో మరోసారి అనుభవంలోకి వచ్చింది.