జనసేన పార్టీలో చేరికలు పుంజుకున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు సహా పలువురు వైసీపీ సీనియర్ నాయకులు జనసేన పార్టీ కండువాలు కప్పుకొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఆయా నేతలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తుని నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా నిన్న మొన్నటి వరకు యనమల కృష్ణుడు వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారన్న హామీ కూడా ఉంది. అయితే.. ఆయన అనూహ్యంగా పార్టీకి రిజైన్ చేసి.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
ఇక, యనమల కుటుంబం ఆది నుంచి టీడీపీలోనే ఉండేది. అయితే.. గత రెండు ఎన్నికల్లో రామకృష్ణుడు తప్పుకొని తన తమ్ముడు కృష్ణుడికి టికెట్ ఇప్పించారు. అయినా.. ఆయన విజయం దక్కించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో 2024లో రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను రంగంలోకి దింపి.. టీడీపీ టికెట్‌పై గెలుపు గుర్రం ఎక్కించారు. ఈ నేపథ్యంలోనే కృష్ణుడు.. టీడీపీని వదిలి వైసీపీ చెంతకు చేరారు. పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నా.. తాజాగా ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీ స్థానిక నాయకులు కూడా కృష్ణుడి వెంట జనసేన లో చేరిపోయారు. తుని నియోజకవర్గానికే చెందిన వైసీపీ నేత శేషగిరి రావు, తణుకు నేత కృష్ణ శ్రీనివాస్, ముమ్ముడి వరం నేత శివన్నారాయణ తదితరులు కూడా వైసీపీ కండువా వదిలేసి జనసేనలో చేరిపోయారు.
హిందూపురంలో గట్టి దెబ్బ
మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైసీపీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. కీలక నాయకుడు నవీన్ నిశ్చల్ కూడా తాజాగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బలమైన సామాజిక వర్గం, బలమైన కేడర్ ఉన్న నవీన్.. స్థానికంగా బాలయ్యకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయన ప్రాతినిధ్యం తగ్గడం, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయాలు పెరిగిపోవడంతో నవీన్ నిశ్చల్ వైసీపీని వదిలేసి పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిపోయారు. ఆయనతోపాటు సత్రవాడ ప్రవీణ్, మిద్దెల హరి, ఏలూరి ప్రసాద్ జనసేనలో చేరారు. దీంతో హిందూపురంలో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టేనని స్థానిక నేతలు భావిస్తున్నారు.
పెద్ద కుటుంబం.. : పవన్
జనసేన పార్టీ పెద్ద కుటుంబమని..ఎంత మంది కుటుంబ సభ్యులు వచ్చినా ఆదరిస్తామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసమే కాకుండా.. ప్రజలకు సేవ చేయాలన్న దృక్ఫథంతో వచ్చే వారిని ఆహ్వానిస్తామన్నారు. పార్టీ సిద్ధాంతాలను అర్ధం చేసుకోవడంతో పాటు వాటిని ప్రజలకు కూడా వివరించాలని ఆయన సూచించారు. పార్టీ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సీనియర్లు కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీలతో అందరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే పరమావధిగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా కొత్త నాయకులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.