కూట‌మి బొనాంజా.. ఊహించ‌ని యువ‌త‌!

admin
Published by Admin — September 16, 2026 in Andhra
News Image

ఏపీలోని కూట‌మి స‌ర్కారు నిరుద్యోగుల‌కు భారీ తీపిక‌బురు చెప్పింది. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ - 1 పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 163 పోస్టుల‌ను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి 27వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌ వరకు ఆయా పోస్టుల‌కు సంబంధించిన‌ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అభ్య‌ర్థులు త‌మ ప్రాంతం, జిల్లా, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించే వెసులు బాటు క‌ల్పించారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్లు 11, ట్యాక్స్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ కమిషనర్లు 14, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్‌ సివిల్‌ 36, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్‌ కమ్యూనికేషన్స్‌ 3, జిల్లా విద్యా శాఖ అధికారులు.. 14, గిరిజ‌న సంక్షేమ శాఖ అధికారి 1, ప్రాంతీయ ర‌వాణా శాఖ అధికారులు... 3, డిప్యూటీ రిజిస్టర్‌ కోఆపరేటివ్‌ సర్వీసెస్ అధికారులు 15, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 12, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ 2, డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 14, డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ 35 పోస్టులు ఉన్నాయి.

కొన్ని పోస్టుల‌కు బ్యాచ‌ల‌ర్ డిగ్రీని అర్హ‌త‌గా పేర్కొన‌గా.. మ‌రికొన్ని పోస్టుల‌కు బీఈ, బీటెక్, ఇంజ‌నీరింగ్‌ను అర్హ‌త‌గా పేర్కొన్నారు. యూనిఫాం స‌ర్వీసుల‌కు దేహ‌దారుఢ్యం క‌లిగి ఉండాల‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఇత‌ర వివ‌రాల కోసం అభ్య‌ర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. రిజ‌ర్వేష‌న్ స‌హా అర్హ‌త‌లు, వ‌యో ప‌రిమితికి సంబంధించిన అంశాలు.. నేటివిటీ వంటివి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందు ప‌రిచిన‌ట్టు వివ‌రించింది.

వ‌రుస నోటిఫికేష‌న్లు..

వీటితోపాటు మ‌రో 700 పైచిలుకు వివిధ ఉద్యోగాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ల‌ను కూడా స‌ర్కారు విడుదల చేసింది. వీటిని కూడా ఏపీపీఎస్సీ ద్వారానే భ‌ర్తీచేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ వివ‌రాల‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందు ప‌రిచింది. కాగా.. మ‌రోవైపు.. డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను కూడా త్వ‌ర‌లోనే విడుదల చేయ‌నున్నారు. త‌ద్వారా 5 నుంచి 6 వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు మంత్రి నారా లోకేష్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మొత్తంగా ఈ భ‌ర్తీ ద్వారా నిరుద్యోగుల క‌ల‌ల‌ను కూట‌మి స‌ర్కారు సాకారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags
Cm chandrababu good news unemployed youth ap APPSC notification
Recent Comments
Leave a Comment

Related News