తల్లీ.. చెల్లిని కించపరిచిన వారు సమాజానికి భారమని, అలాంటివారికి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చా రు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలతోపాటు.. 23 మునిసిపాలిటీలకు, నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆయన పార్టీ ముఖ్యనాయకులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తల్లికి చెల్లికి అవమానం కలిగిస్తున్నారని.. శుభలేక ఇచ్చేందుకు వచ్చిన చెల్లిపై తీవ్ర అసభ్య వ్యాఖ్యలతో కథనం రాయించారని.. సభ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
గతంలో తల్లిని కూడా తీవ్రంగా అవమానించి పార్టీ నుంచి బయటకు పంపేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఉమ్మడి ఆస్తులను చెల్లికి పంచాల్సి ఉంటుందన్న కారణంతో చెల్లిని దూరం పెట్టారని అన్నారు. ఇలాంటి వారు మహిళల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా రో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారనిఅన్నారు. పార్టీ తరఫున కూడా ప్రజలకు ఆయా విషయాలను వివరించాలని.. మహిళల భాగస్వామ్యం కూటమికే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మరోసారి రిపీట్ కావాలని చంద్రబాబు పేర్కొన్నారు.
గొడ్డలి పార్టీ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు చెప్పారు. ప్రజలు చీదరించుకుంటున్నారని.. అయినా ఆ పార్టీ నాయకులు మారడం లేదని అన్నారు. ఇవన్నీ ప్రజలకు మరోసారి వివరించాలని అవసరమైతే.. ఇంటింటికీ వెళ్లి చెప్పాలని అన్నారు. కేవలం మీడియా ముందు మాత్రమే కొందరు నాయకులు కనిపిస్తున్నారని.. ఇది తగదని అన్నారు. పార్టీ పరంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. ప్రజల్లో సానుకూలతను మరింత పెంచుకునేలా వ్యవహరించాలన్నారు. కొందరు మాత్రమే ప్రజల మధ్యకు వెళ్తున్నారని.. ఈ వివరాలన్నీ తనవద్ద ఉన్నాయని చెప్పారు. అందరూ కలసి కట్టుగా ముందుకు సాగాలన్నారు.
కూటమికే ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. చిన్న చిన్న విభేదాలు ఎక్కడైనా సహజమేనన్న ఆయన.. వాటిని సరిదిద్దుకు నే ప్రయత్నం చేయాలన్నారు. ప్రతివిషయాన్నీ పెద్దది చేసి.. కూటమికి విఘాతం కలిగిస్తే.. ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదన్నారు. ఇటీవల జరిగిన పరిణామం(షర్మిల శుభలేఖ.. అనంతరం వైసీపీ నేతల కథనం) తనను తీవ్రంగా ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. ఇలాంటివి ఎవరూ ప్రోత్సహించరాదని చెప్పారు. గొడ్డలి పార్టీ సంస్కృతిని ఎవరూ పుణికి పుచ్చుకోవద్దని అన్నారు. మహిళలను కించపరిచే సంస్కృతి టీడీపీకి, కూటమికి కూడా లేదని చెప్పారు.