రాజకీయ రాజధాని విజయవాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక పేరు వినిపిస్తోంది.. అదే వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radha Krishna). దశాబ్దాల బెజవాడ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోవడం, అందునా వంగవీటి రాధా ఏకంగా లక్షా ముప్పై వేలకు పైచిలుకు భారీ మెజారిటీతో తిరుగులేని విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పాతికేళ్ళ తర్వాత వంగవీటి కుటుంబం నుంచి మళ్లీ నగర పాలక సంస్థలో ఈ స్థాయి అధికారం చేతికి రావడంతో ఆ ప్రాంతంలో జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంది.
కాపుల ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి రంగా కార్పొరేటర్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి విజయవాడ(Vijayawada)ను ఏలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు రాధాకృష్ణ తండ్రికి భిన్నంగా తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి, నేరుగా మేయర్‌గా కార్పొరేషన్లోకి అడుగుపెట్టడం విశేషం. బెజవాడ రాజకీయాన్ని శాసించే అసలైన శక్తిగా ఆయన మారబోతున్న తరుణంలో, ఈ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నారని టాక్.
ఈ వేడుకను కేవలం ఒక రాజకీయ కార్యక్రమంగా కాకుండా, విజయవాడ చరిత్రలోనే నిలిచిపోయేలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కూటమి మంత్రులంతా హాజరవుతున్న ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి ఇద్దరు లెజెండ్స్ రాబోతున్నారనే ప్రచారం బెజవాడ రాజకీయాలను హీటెక్కిస్తోంది. వారే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna).
2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాధాతో ఉన్న అనుబంధం రీత్యా చిరంజీవి(Chiranjeevi) ఈ వేడుకకు హాజరవుతారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు కూటమి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య.. రాధాకృష్ణతో ఉన్న వ్యక్తిగత స్నేహం, సాన్నిహిత్యం కారణంగా ఈ పట్టాభిషేకానికి రావడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒకే వేదికపై మెగాస్టార్, బాలయ్య బాబు కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు అభిమానుల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. వంగవీటి బ్రాండ్, విజయవాడ క్రేజ్, కూటమి భారీ విజయం.. వీటన్నింటికి తోడు చిరు, బాలయ్య కలయిక గనుక నిజమైతే బెజవాడలో పూనకాలు లోడింగ్ అనడంలో సందేహం లేదు.