ఎన్నికలు ఏవైనా.. సినీ గ్లామర్ కీలకంగా మారుతోంది. గత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిన్నపాటి సినీ నటుల నుంచి జబర్దస్త్ కమెడియన్ల వరకు కూడా అందరూ జనసేనకు మద్దతు ప్రకటించారు. పిఠాపురం సహా.. పలు నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల తరఫున ప్రచారం చేశారు. ఇక, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జబర్దస్త్ కమెడియన్లు మరోసారి రంగంలోకి దిగారు. ప్రచార పర్వంలో తమదైన రీతిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ సహా అనకాపల్లి ప్రాంతాల్లో జబర్దస్త్ కమెడియన్లు శనివారం నుంచి మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
జబర్దస్త్ క్యామిడీ షోల ద్వారా ప్రజలను ఆకట్టుకున్న రాజు, అప్పారావు సహా పలువురు నటులు.. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో శనివారం కూటమి పార్టీల అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ.. అభ్యర్థుల తరఫున కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. పలువురు అభిమానులకు సెల్ఫీలు కూడా ఇచ్చారు. తమదైన హాస్యనటనతో అందరినీ ఆకట్టుకున్న రాజు, అప్పారావులను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. వారితో కరచాలనం చేయడంతోపాటు.. ఫొటోలు కూడా దిగారు. గత ఎన్నికల్లో కూడా తమ ప్రచారానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని రాజు తెలిపారు.
ఇక, విశాఖ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి మేయర్ పీఠం రేసులో ఉన్నారు. అయితే.. ఇక్కడ వైసీపీ నుంచి అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కూడా బలమైన పోటీ నెలకొంది. విశాఖలో ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడం, డేటా కేంద్రం ఏర్పాటు, ఐటీ విస్తరణ వంటివి తనకు కలిసి వస్తాయని శ్రావణి చెబుతున్నారు. అయినప్పటికీ.. జబర్దస్త్ షో ద్వారా ప్రజలను ఆకట్టుకున్న నటులను కూడా ఆహ్వానించామని ఆమె చెప్పారు. వారి ద్వారా తన విజయం మరింత ఈజీ అవుతుందని శ్రావణి పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోందని వివరించారు.
ఇక, అనకాపల్లిలోనూ జబర్దస్త్ కమెడియన్లు ప్రచారం చేశారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థుల తరఫున వారు ప్రచారంలో పాల్గొన్నారు. గత రెండేళ్లుగా కూటమి సర్కారు చేసిన పనులు.. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రజలకు, రాష్ట్రానికి ఎంత అవసరం.. అనే విషయాలను చెబుతున్నారు. అలానే స్థానిక ఎన్నికల్లోనూ ఈ కూటమిని గెలిపించాలని.. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సహకరించాలని వారు తమ ప్రచారంలో ప్రజలకు వివరిస్తుండడం గమనార్హం