`నీ.. తొలిచూపులోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా..` అంటూ సాగే జస్టిస్ చౌదరి సినిమాలోని తెలుగు ఓల్డ్ లవ్ సాంగ్ గుర్తుందా. అచ్చంగా తన ప్రేమ ప్రయాణం కూడా అలానే సాగిందని వివరించారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ. దివంగత రాజీవ్ గాంధీ సతీమణిగానే కాకుండా.. 2004-14 మధ్య యూపీఏ చైర్ పర్సన్‌గా కూడా వ్యవహరించిన ఆమె.. దేశంలో కీలక సంస్కరణలు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి పీఠం ఎక్కే అవకాశం వచ్చినా.. ఆ సమయంలో ఆమె వదులుకున్నారు. కాగా.. `బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్` పేరుతో తన ప్రేమ ప్రయాణం గురించి ఆమె పుస్తకం రాశారు.
320 పేజీల మేరకు ఉన్న ఈ పుస్తకం.. మరో 15 రోజుల్లో విడుదల కానుంది. ఈ పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదమైన విషయం తెలిసిం దే. కాగా.. తన పుస్తకాన్ని పరిచయం చేస్తూ.. సోనియాగాంధీ తాజాగా ఎక్స్‌లో ఓ వీడియోను పంచుకున్నారు. రాజీవ్‌ను తాను తొలిసారి చూసిన క్షణమే ప్రేమలో పడ్డానని పేర్కొన్నారు. కేమ్బ్రిడ్జ్లోని ఓ రెస్టారెంట్లో కామన్ ఫ్రెండ్ ద్వారా రాజీవ్‌తో ఏర్పడిన స్నేహం.. ప్రేమ.. పెళ్లి వంటి తన జీవితంలో మధురానుభూతులను నింపాయని సోనియా పేర్కొన్నారు. 79 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ... తన వృత్తి జీవితం నుంచి రాజీవ్ గాంధీతో తనకు ఏర్పడ్డ పరిచయం.. ఆయన మరణం వరకు అన్ని విషయాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు.
తను తొలి చూపులో ప్రేమలో పడ్డానని సోనియా చెబుతూ.. చిరు నవ్వులు చిందించారు. స్పురద్రూపి అయిన రాజీవ్.. ఎంతో సౌమ్యుడని, నిదానస్తుడని పేర్కొన్నారు. ``తొలిసారి ఆయనను చూడడంతోనే నాకు తగిన వ్యక్తి అనిపించింది.`` అని సోనియా తెలిపారు.. తొలిసారి రాజీవ్‌తో కలిసి గడిపిన క్షణాలను తన జీవితాంతం గుర్తుంచుకున్నట్టు తెలిపారు. తమ అందమైన ప్రయాణంలో అనేక అనుభూతులు ఉన్నాయని.. ఆయన సౌమ్యత్వం తనను కట్టిపడేసిందని పేర్కొన్నారు. ప్రేమ, నవ్వులు, జ్ఞాపకాలతో తమ ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకు న్నామని పేర్కొన్నారు. ``ఈ అందమైన ప్రేమ పుస్తకం నవంబరు 10న మీ ముందుకు రానుంది.`` అని సోనియా వెల్లడించారు.