అమెరికా గడ్డపై కలలు కనే టెక్కీలకు, లక్షలాది మంది హెచ్-1బీ(H-1B) ఉద్యోగులకు వైట్‌హౌస్ నుంచి ఒక భారీ పిడుగులాంటి వార్త బయటికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ విదేశీ వలసలపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. తాజాగా ఆయన సర్కార్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం గ్లోబల్ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్‌ను (PLC) పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా వలస వర్గాల్లో కలవరం మొదలైంది.
ఈ తాజా చర్య కేవలం ఒకరిద్దరిని ప్రభావితం చేసేది కాదు. ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి గ్లోబల్ జెయింట్స్‌తో పాటు, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఎనిమిది సంస్థలకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను పక్కన పెట్టాలని కార్మిక శాఖ గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ఈ కంపెనీల ద్వారా అమెరికాలో అడుగుపెట్టిన హెచ్-1బీ ఉద్యోగులకు భవిష్యత్తులో గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాస హోదా) దక్కడం దాదాపు అసాధ్యంగా మారుతుంది.
ఈ సంచలన నిర్ణయం వెనుక పెద్ద రాజకీయ, ఆర్థిక కారణమే ఉందని ట్రంప్(Trump) యంత్రాంగం వాదిస్తోంది. వీసా వ్యవస్థను ఈ కంపెనీలు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తీవ్రంగా ఆరోపించారు. 2009 నుంచి ఈ ఎనిమిది సంస్థలు అడ్డగోలుగా శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లను పొందుతూ, స్థానిక అమెరికన్లకు చెందాల్సిన లక్షలాది ఉద్యోగ అవకాశాలను లాగేసుకుంటున్నాయని లేబర్ మినిస్టర్ కీత్ సాండర్లింగ్ విమర్శించారు. విదేశీ ఉద్యోగుల రాకను కట్టడి చేసి, అమెరికన్ సిటిజెన్లకు ప్రాధాన్యం కల్పించాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని ఈ చర్యల ద్వారా తేల్చిచెప్పారు.
ఇక ట్రంప్ ప్రభుత్వం కేవలం కార్మిక సర్టిఫికేషన్ల రద్దుతో ఆగలేదు. అమెరికన్ యూనివర్సిటీల్లో చదువు ముగించుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే ప్రతి అంతర్జాతీయ విద్యార్థిపై ఏకంగా 70 వేల డాలర్ల మేర భారీ ఫీజును వసూలు చేయాలనే మరో కఠినమైన ప్రతిపాదనను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెరపైకి తెచ్చింది. సరిగ్గా ఈ ప్రతిపాదన వచ్చిన మరుసటి రోజే ఐటీ దిగ్గజాలపై ఈ లేబర్ సర్టిఫికేషన్ కొరడా ఝుళిపించడం గమనార్హం. మొత్తానికి అమెరికా(America)లో శాశ్వతంగా స్థిరపడాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు, కొత్తగా వెళ్లాలని చూస్తున్న ఆశావహులకూ ఈ పరిణామాలు శరాఘాతంగా మారాయి. మునుముందు ఈ నిబంధనలు ఏ రూపం దాల్చుతాయో, దీనికి ఐటీ కంపెనీలు ఎలా స్పందిస్తాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.