రాజకీయాల్లో సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చూస్తే కొన్నిసార్లు వ్యూహాలు ఎంతలా బెడిసికొడతాయో చెప్పడానికి మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) తాజా రాజకీయం ఒక ఉదాహరణగా నిలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పోలీసుల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని భారీ సెంటిమెంట్ డ్రామాకు తెరతీసిన ఆమె.. విక్టిమ్ కార్డ్‌తో పెద్ద ఎత్తున పొలిటికల్ మైలేజ్ సాధించాలనుకున్నారు. కానీ, ఆమె ఇంట్లో కూర్చుని పరామర్శల పర్వంతో బిజీగా ఉన్న సమయంలో.. క్షేత్రస్థాయిలో పార్టీకి జరగాల్సిన అసలు నష్టం జరిగిపోయింది.
స్థానిక సంస్థల ఎన్నికల(Local Polls) నామినేషన్ల సమయంలో పోలీసులతో జరిగిన గందరగోళాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో రజిని ముందు వరుసలో నిలిచారు. తనను కింద పడేశారంటూ సానుభూతి డ్రామాకు తెరలేపి, వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలందరినీ తన నివాసానికి రప్పించుకున్నారు. పరామర్శల పేరుతో సాగిన ఈ తంతుకు లైవ్ కవరేజీలు ఇస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఈ విక్టిమ్ కార్డ్ ప్లాన్ సూపర్ హిట్ అవుతుందని భావించిన ఆమెకు, ఊహించని విధంగా వెన్నుపోటు రూపంలో భారీ షాక్ తగిలింది.
రజిని ఒకవైపు ఇంట్లో కూర్చుని సెంటిమెంట్ రాజకీయం నడిపిస్తుంటే, ఆమె ఎంతో నమ్మకంగా బరిలో నిలిపిన అభ్యర్థే సైలెంట్‌గా ప్రత్యర్థి క్యాంపులోకి దూకేశారు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రజిని ప్రతిపాదించిన కరీమూన్.. వైఎస్సార్‌సీపీకి హ్యాండ్ ఇచ్చి ఏకంగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకున్నారు. అంతటితో ఆగకుండా టీడీపీ(TDP) అభ్యర్థి గెలుపు కోసం స్వయంగా ప్రచారంలోకి దిగడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కోలుకోలేని దిగ్భ్రాంతికి గురయ్యాయి.
నామినేషన్ వేయించడం, అది ఉపసంహరణ కాకుండా చూసుకోవడం వరకే రజిని(Rajini) తన బాధ్యతగా భావించారు తప్ప.. ఆ అభ్యర్థి తన వెంటే ఉన్నారా, పార్టీకి కట్టుబడి ఉన్నారా లేదా అనే కనీస నిఘా పెట్టడంలో ఘోరంగా విఫలమయ్యారు. పోటీ నుంచి తప్పుకోకుండా జాగ్రత్తపడినప్పటికీ, కరీమూన్ టీడీపీ వైపు క్యూ కట్టకుండా ఆపలేకపోయారు. దీంతో సొంత నియోజకవర్గంలోనే తాను నిలబెట్టిన అభ్యర్థిని కాపాడుకోలేని నాయకురాలు, రాష్ట్ర స్థాయిలో పార్టీని ఏం నడిపిస్తారంటూ ఇప్పుడు సొంత పార్టీ కేడరే బాహాటంగా విమర్శలు గుప్పిస్తోంది. మొత్తానికి, సానుభూతితో రాజకీయ లబ్ధి పొందాలనుకున్న రజిని వ్యూహం తుస్సుమనడమే కాకుండా, ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఇది పెద్ద మైనస్‌గా మారింది.