తమిళనాట సినిమా గ్లామర్, పాలిటిక్స్ మధ్య బంధం మళ్లీ గట్టిపడుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు రాజకీయ అరంగేట్రం చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ఇప్పుడు ఆ జాబితాలోకి మరో స్టార్ హీరో చేరబోతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్(Dhanush) త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
చెన్నై పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ధనుష్ త్వరలో తన స్వంత రాజకీయ పార్టీని ప్రకటించనున్నారట. ఈ కొత్త పార్టీకి 'తమిళగ ఎళుచ్చి కళగం(Tamilaga Ezhuchi Kazhagam)' అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇప్పటికే ఈ పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద రిజిస్టర్ చేయించే ప్రక్రియను కూడా పూర్తి చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే ధనుష్ స్వయంగా స్పందించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు.
గత కొంతకాలంగా ధనుష్ తన అభిమాన సంఘాల తీరుతెన్నులపై ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఫ్యాన్స్ అసోసియేషన్స్‌ను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వైపు మళ్లించడం, ఇటీవల తన అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక జెండాను ఆవిష్కరించడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరో స్టార్ హీరో విజయ్(Vijay) తన పార్టీతో సంచలన విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం, దశాబ్దాల రాజకీయ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడం తెలిసిందే. ఈ సక్సెస్ ట్రెండ్ చూశాక, కోలీవుడ్‌లోని మిగతా ప్రముఖుల్లోనూ పొలిటికల్ ఆశలు మరింత బలపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఈ రాజకీయ ప్రవేశంపై ధనుష్(Dhanush) క్యాంపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు. ఇదంతా కేవలం మీడియా వర్గాల్లో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. మరి ధనుష్ నిజంగానే ఈ కొత్త పార్టీతో బరిలోకి దిగుతారా? లేక ఇవన్నీ కేవలం రూమర్లేనా? అనే దానిపై క్లారిటీ రావాలంటే ఆయన నోటి నుంచి వచ్చే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వేచి చూడాల్సిందే.