గోడ కట్టినవాడే గోడ దాటుతుంటే, ఇల్లు నిలబడేదెలా? – విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ. సాక్షాత్తూ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) సొంత నియోజకవర్గంలోనే వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది.దేవర కుదిరాం, కొమురాం పాలవలస, కోనూరు, పెద్దజమ్ము, చోడవరం, వనములపేట.. ఈ ఆరు గ్రామాల పేర్లు ఇప్పుడు జిల్లా రాజకీయ చర్చల్లో వినిపిస్తున్నాయి. ఈ గ్రామాలకు చెందిన సుమారు 200 కుటుంబాలు ఒకేసారి వైసీపీకి గుడ్‌బై చెప్పేశాయి. ఇది ఒకరిద్దరు నాయకుల వ్యక్తిగత నిర్ణయం కాదు. ఊరూరా కుటుంబాలే కదిలివచ్చిన సామూహిక మార్పు. అందుకే దీని ప్రభావం సాధారణ చేరికల కంటే చాలా బలంగా కనిపిస్తోంది.
ఈ వలసలో కేవలం కార్యకర్తలే కాదు, పార్టీని గ్రామస్థాయిలో నడిపించిన వందలాది మంది నాయకులు కూడా ఉన్నారు. వీరంతా వైసీపీ(YCP)కి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గ్రామాల్లో పార్టీకి వెన్నెముకలా నిలిచేది ఇలాంటి కింది స్థాయి క్యాడరే. జెండా మోసేవారు, ఓటర్లను కలిసేవారు, ఎన్నికల్లో బూత్ స్థాయిలో పనిచేసేవారు దూరమైతే, పైస్థాయి నాయకత్వం ఎంత బలంగా ఉన్నా ఫలితాలపై ప్రభావం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.
ఇక వైసీపీకి గుడ్‌బై చెప్పిన సదరు కుటుంబాలు టీడీపీ(TDP) సీనియర్ నేత కళా వెంకట్రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపాయి. అనుభవజ్ఞుడైన నాయకుడి నేతృత్వంలో, ఒకే రోజు ఇంతమంది పార్టీ మారడం స్థానికంగా టీడీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. అదే సమయంలో వైసీపీ శిబిరంలో ఆందోళన పెంచుతోంది.
నిజానికి ఇది ఒక్కసారి జరిగిన ఘటన కాదు. ఇంతకుముందు కూడా పలువురు మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వైసీపీ(YCP)ని వీడిన విషయం తెలిసిందే. ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న ఈ రాజీనామాలు చూస్తుంటే, జిల్లాలో రాజకీయ గాలి దిశ మారుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిణామాలను బొత్స శిబిరం ఎలా ఎదుర్కొంటుందో, కోల్పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి సంపాదిస్తుందో చూడాలి.