ఏపీకి ప్రకాష్ రాజ్.. జగన్ కోసమేనా..?

admin
Published by Admin — October 04, 2026 in Politics, Andhra
News Image

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) పేరు ఎత్తగానే టక్కున గుర్తుకొచ్చేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన చేసే నిప్పులు చెరిగే విమర్శలు. దేశంలో ఎక్కడ ఏ నిరసన జరిగినా, ప్రజా సమస్యల పేరుతో ఏ ఆందోళన మొదలైనా ముందుండే ఆయన, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. అయితే, ఆయన చేస్తున్న పోరాటాలు నిజంగానే ప్రజా సమస్యల పరిష్కారం కోసమా? లేక బీజేపీని, ఆ పార్టీతో కలిసి ఉన్న కూటమి నేతలను ఇరుకున పెట్టేందుకేనా? అన్న ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన అడుగులు ఎవరి కోసం పడుతున్నాయి? ఈ రాజకీయ వ్యూహం వెనుక అసలు మంత్రాంగం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజాగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్, ప్రధాని మోడీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను 'బిల్లా-రంగా' అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ కుట్రలను ప్రతీ ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై పోరాటం పేరుతో ఆయన చేస్తున్న ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైనప్పటికీ, వీటి వెనుక ఉన్న అసలు టార్గెట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఈ ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్ మరో కీలక ప్రకటన చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై తాను ప్రత్యేకంగా ఒక సర్వే చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సర్వే రిపోర్ట్ తన చేతికి రాగానే నేరుగా ఏపీకి వచ్చి అన్ని విషయాలు మాట్లాడతానని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీనీ, నేతను తన శత్రువుగా భావించే ప్రకాష్ రాజ్.. ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేయడం ఎప్పుడూ ఉండేదే. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకొని కారణంగా వైసీపీని, దాని అధినేత జగన్‌ని మిత్రుడుగా అనుకుని, ఆయనకు అండగా నిలబడేందుకు ప్రకాష్ రాజ్ వస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ఇక ప్రకాష్ రాజ్ చేసే ప్రతి వ్యాఖ్యానాన్ని, ఆయన చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని వైసీపీ(YCP) అనుకూల మీడియా ప్రసారం చేస్తుండటం గమనించదగ్గ విషయం. ఇది ఆయనకు, వైకాపాకు మధ్య ఉన్న  బలమైన అనుబంధాన్ని స్పష్టం చేస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే వైకాపా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండగా, ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ స్థాయి వ్యక్తి బయటి నుంచి వచ్చి ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ప్రయత్నించడం వెనుక పెద్ద వ్యూహామే ఉందనే చర్చ సాగుతోంది. 2019 నాటి రాజకీయ పునరావృతం కాకుండా, రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags
Prakash Raj Andhra Pradesh AP Politics YSRCP Chandrababu Naidu Pawan Kalyan YS Jagan
Recent Comments
Leave a Comment

Related News