గొడ్డలిపార్టీకి మూడు ప్రశ్నలు అంటూ.. వైసీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేశారు మంత్రి నారా లోకేష్. తాజాగా శుక్రవారం అన్నమయ్య(ఉమ్మడి చిత్తూరు) జిల్లాలోని మదనపల్లెలో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ``మొన్న ఒక ఇంగ్లీష్ పేపర్లో చంద్రబాబు గారి గురించి `వాటర్ మ్యాన్` అని రాశారు. అది చూసి గొడ్డలి పార్టీ వాళ్లు ఏడుస్తున్నారు.`` అని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా.. నేను వాళ్లని మూడు ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నానని తెలిపారు.
``సీమ రైతుకి వరంలాంటి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసింది ఎవరు? పట్టిసీమ ప్రాజెక్టుతో ఎటువంటి ఉపయోగం లేదు అన్నది ఎవరు? పోలవరం ప్రాజెక్టు అర్థం కాలేదు - మీకు ఏం అర్థమవుతుంది అన్నది ఎవరు? గొడ్డలి పార్టీ కాదా? నీటిని దేవుడిలా - ఇరిగేషన్ ప్రాజెక్టులను దేవాలయంలా భావించేది చంద్రబాబు. సీమ ప్రాజెక్టులు ప్రారంభించింది మనమే, పూర్తి చేయబోయేది మనమే. తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, పోలవరం మన ట్రేడ్ మార్క్.`` అని నొక్కి చెప్పారు.
ఆయా ప్రాజెక్టుల వల్లే రాయలసీమ అరటి వరల్డ్ ఫేమస్ అయ్యిందని లోకేష్ చెప్పారు. ఈ ప్రాజెక్టుల వల్లే కరువు నేలపై కియా కార్లను తయారు చేస్తున్నామన్నారు. అందుకే చంద్రబాబును అందరూ వాటర్ మ్యాన్ అంటున్నారని పేర్కొన్నారు. హార్టికల్చర్ అయినా, క్వాంటం అయినా చంద్రబాబు ముందుంటారని, మనం ఈ రోజు గురించి ఆలోచిస్తే... చంద్రబాబు వచ్చే 20 ఏళ్ల గురించి ఆలోచిస్తారని అన్నారు. దానికి ఉదాహరణే - ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని తెలిపారు.
``దేశంలో ఉన్న గొప్ప పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి వరల్డ్ క్లాస్ బిజినెస్ స్కూల్ పెట్టాలనుకున్నారు. ఆ విషయం చంద్రబాబుకు తెలిసింది. వాళ్లు దేశం మొత్తం తిరుగుతున్నారు. హైదరాబాద్ కి రావాలనే ఆలోచనలో అసలు లేరు. కానీ ఐఎస్బీని ఏపీకి తీసుకురావాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ఐఎస్బీ బోర్డుని అప్రోచ్ కాగా, వాళ్లు ఏపీ అసలు మా కన్సిడరేషన్ లోనే లేదన్నారు. అప్పుడు బాబు వాళ్లని ఒకసారి హైదరాబాద్ కి రమ్మని ఆహ్వానించారు. స్వయంగా సీఎం గారే ప్రజెంటేషన్ ఇచ్చారు. బొంబాయి, హైదరాబాద్, చెన్నై, కర్ణాటక అన్ని చోట్లకి వాళ్లు వెళ్లారు. ఫైనల్ గా హైదరాబాద్ నే సెలెక్ట్ చేసుకున్నారు. దట్ ఈజ్ బ్రాండ్ సీబీఎన్.`` అని లోకేష్ నొక్కి చెప్పారు.