వెలిగొండ ఎఫెక్ట్‌: 20 ల‌క్ష‌ల ఓట్లు కూట‌మికేనా.. ?

admin
Published by Admin — September 24, 2026 in Andhra
News Image

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని(ప్ర‌స్తుతం మార్కాపురం) వెలిగొండ ప్రాజెక్టు తొలి ద‌శ‌ను ప్ర‌భుత్వం పూర్తి చేసింది. సీఎం చంద్ర‌బాబు గ‌త నెల‌లో 31నే దీనిని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప‌రిధి.. ఒక్క మార్కాపురానికి మాత్ర‌మే కాకుండా.. క‌డ‌ప వ‌ర‌కు.. మొత్తంగా 4 జిల్లాల‌కు విస్త‌రించింది. అదేస‌మ‌యంలో 4 ల‌క్ష‌ల కుటుంబాల‌కు.. 1.50 ల‌క్ష‌ల రైతుల‌కు మేలు చేస్తుంది. ఇలా.. చూసుకుంటే.. ఈ ప్రాజెక్టు ద్వారా రాజ‌కీయంగా కూడా కూట‌మి స‌ర్కారుకు మేలు జ‌రుగుతుంద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి. త‌ద్వారా.. ఒక్కొక్క కుటుంబంలో నాలుగు ఓట్లు వేసుకున్నా.. సుమారు 20 ల‌క్ష‌ల ఓట్లు.. ప్ర‌భావితం అవుతాయ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే లక్షలాది మంది ఓటర్లపై కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌ సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది. కృష్ణా జలాలను నల్లమలసాగర్‌లోకి విడుదల చేయ‌డం ద్వారా 30 ఏళ్లుగాఇక్క‌డ చుక్క నీటి కోసం అల్లాడుతున్న ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. ఇక‌, ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న ఓటు బ్యాంకు, రాజకీయ ప్రభావం వంటివి స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తాయి. ప్రత్యక్ష లబ్ధిదారులు(ఓటు బ్యాంకు) కూట‌మికి అనుకూలంగా మార‌నున్నారు. తొలి దశ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, మర్కాపురం, కడప జిల్లాల్లోని సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

దీనివల్ల ఈ ప్రాంతాల్లోని రైతు కుటుంబాల ఓట్లు కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక‌, మొదటి దశ ద్వారా ఫ్లోరైడ్, కరవు పీడిత ప్రాంతాలలోని సుమారు 4 లక్షల మంది ప్రజలకు తాగునీరు లభిస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దాదాపు 15 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. దీంతో ఆయా కుటుంబాల వారు కూడా కూట‌మికి అనుకూలంగా మారుతార‌ని అంటున్నారు. ఇక‌, పున‌రావాస కేంద్రాల్లోని వారు ఇప్ప‌టికే టీడీపీలో చేరిపోయారు. కొంద‌రు జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు.

పశ్చిమ ప్రకాశం (మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు), కడప, నెల్లూరు జిల్లాల పరిధిలోని దాదాపు 30 మండలాలపై ఈ ప్రాజెక్టు ప్రభావం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు ప్రారంభానికి ముందే వివాదాలు లేకుండా చూసేందుకు నిర్వాసితులకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. పునరావాస ప్యాకేజీల కింద రూ.768 కోట్లతో పాటు, అదనంగా రూ.169 కోట్లను మరియు 11 గ్రామాల్లోని అర్హులైన నిర్వాసితులకు మరో రూ.165.91 కోట్లను మంజూరు చేసి చెక్కులను పంపిణీ చేసింది. ఈ పరిహారాల పంపిణీ కూడా కూటమికి రాజకీయంగా కలసివచ్చే అంశం.

Tags
Veligonda project bagged 20 lakh votes to nda alliance
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News