ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కూటమి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 2024 ఎన్నికల ఫలితాలే ఈసారి కూడా రిపీట్ అవుతాయని బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూటమి పార్టీల విజయానికి కష్టపడి పని చేయాలని మూడు పార్టీల అగ్ర నేతలు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందని పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు.
ఈసారి కూడా 100% విజయం సాధిస్తామని అన్నారు. విశాఖలో పర్యటించిన సందర్భంగా ఆయన జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపికలు, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలని నాదెండ్ల సూచించారు. ఎన్నికలలో వార్డుల వారీగా బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేయాలని నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం అనే విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని, స్థానాల సంఖ్య కంటే గెలిచే బలం ఉన్న స్థానాల్లో నిలబడి ఖచ్చితమైన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.