తన గ్లామర్, అలాగే నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత జీవితంలో అత్యంత మధురమైన కాలాన్ని ఆస్వాదిస్తున్నారు. దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో వివాహం తర్వాత, ఈ దంపతులు తమ తొలి సంతానం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సమంత ఏడో నెల ప్రెగ్నెన్సీతో ఉన్నారు.
సాధారణంగా ఈ సమయంలో సెలబ్రిటీలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, సమంత మాత్రం తన ప్రొఫెషనల్ కమిట్మెంట్స్కు ఫుల్స్టాప్ పెట్టకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకోవడానికి బదులుగా, తన వృత్తిపై ఉన్న అంకితభావాన్ని మరోసారి చాటుకుంటూ ఆమె సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ప్రముఖ రియాలిటీ షో ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్(Celebrity Master Chef Tamil)’ షూటింగ్లో ఆమె ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కొత్త ప్రయాణంపై సమంత(Samantha) తన ఆనందాన్ని పంచుకుంటూ.. తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్లన్నింటికంటే ఇది పూర్తిగా భిన్నమైన అనుభవమని తెలిపారు. ఆహారం కేవలం ఆకలి తీర్చడమే కాకుండా, మనుషులను దగ్గర చేస్తుందని, మధురమైన జ్ఞాపకాలను పంచుతుందని ఆమె అభివర్ణించారు. కెమెరా ముందు ఎప్పుడూ చూసే కోణమే కాకుండా, సెలబ్రిటీల అసలు సిసలు వ్యక్తిత్వాన్ని ఈ షో బయటపెడుతుందని ఆమె పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా పేరొందిన ‘మాస్టర్‌చెఫ్(Master Chef)’ ఫార్మాట్ ఆధారంగా రూపొందుతున్న ఈ షోలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కిచెన్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వంట చేస్తూ వారు చేసే అల్లరి, పడే పాట్లు ఎలా ఉండబోతున్నాయనేది ప్రేక్షకులకు కన్నుల పండగగా మారనుంది. త్వరలోనే ‘సోనీ విళా’, ‘సోనీ లివ్’ ఓటీటీ వేదికలలో ప్రసారం కానున్న ఈ షోకు, బనిజయ్ ఆసియా నిర్మాణ సంస్థ వ్యవహరిస్తోంది. కాగా, వ్యక్తిగత జీవితంలో తల్లిగా ప్రమోట్ అవుతూనే, మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తున్న సమంత డేరింగ్ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చూపిన ఈ ఎనర్జీ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.