ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన కీలక నాయకుడు, వైసీపీలో నెంబర్ టూగా ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పూర్తిగా రూటు మార్చేశారు. తనకంటూ ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని ఆయన ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాను సీఎం రేసులో ఉండబోనని, యువత (జెన్ జీ)కి ఆ పీఠం కట్టబెడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలు విస్మయకర చర్చలకు తావిస్తోంది. ఆయన హావభావాలు, మీడియా ముందుకు వచ్చిన తీరు గమనిస్తే.. అందులో ఎలాంటి దూకుడుగానీ, ఉత్సాహం గానీ కనిపించడం లేదన్నది సుస్పష్టం. ఏదో తెలియని ఒత్తిడి, తీవ్రమైన అలసట ఆయన ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. మరి ఈ వయసులో, ఈ పరిస్థితుల్లో ఆయన ఈ సాహసానికి ఎందుకు పూనుకుంటున్నారు? దీనివల్ల ఆయనకు రాజకీయంగా ఒరిగేదేమిటి?
ఈ కొత్త పార్టీ ప్రకటన వెనుక కేవలం రాజకీయ ఆశయాలు మాత్రమే లేవని, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత కూడా, జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) మనసు మార్చుకుని తనను మళ్లీ పాత స్థానంలోకి తీసుకుంటారనే ఆశ ఆయనలో ఇంకా సజీవంగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నేరుగా పార్టీలోకి వెళ్లలేని దైన్య పరిస్థితిలో, బయట నుంచి ఒక స్వతంత్ర శక్తిగా ఎదిగి జగన్‌పై ఒత్తిడి తెచ్చే బార్గేనింగ్ ప్లానే ఈ కొత్త ప్రయోగానికి అసలు కారణం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు, గత కేసుల నుంచి రక్షణ పొందాలనే ఆసక్తి, లేదా ఏదైనా కేంద్ర స్థాయి రాజకీయ శక్తుల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి.
అయితే అపారమైన రాజకీయ అనుభవం, వ్యూహకర్తగా పేరున్న విజయసాయిరెడ్డికి జనసమీకరణ, ప్రజాకర్షణ లేని పార్టీల గతి ఏమవుతుందో తెలియనిది కాదు. గతం లోనూ సొంతంగా పార్టీలు పెట్టి, సోషల్ మీడియాలో హడావుడి చేసి చతికిలపడిన నాయకుల ఉదంతాలు కళ్లముందే ఉన్నాయి. కేవలం డిజిటల్ క్యాంపెయిన్లు, కోట్లాది రూపాయల ఖర్చుతో పేపర్ మీద పార్టీ నడిపితే సరిపోదు. జనం గుండెల్లో స్థానం సంపాదించాలంటే అలుపెరగని పోరాటం కావాలి. పైగా రాజకీయాల్లో ఏ పని చేయాలన్నా ఆర్థిక వనరులు అత్యంత కీలకం. ఈ విషయంలో విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) వద్ద పైసాకు లోటు లేదు. కానీ, రాజకీయ రంగస్థలంలో కేవలం డబ్బు ఉంటే సరిపోదనేది అక్షర సత్యం. ఆ డబ్బును నమ్మి ప్రజల్లోకి వెళ్లే బలమైన కేడర్, నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులు ఉండాలి. కానీ, ప్రస్తుత ఆయన శారీరక, మానసిక స్థితిని బట్టి చూస్తే.. ఈ కొత్త ప్రయాణం ఆశయం కోసం కాకుండా, కేవలం ఒత్తిళ్ల నుంచి తప్పించుకునే తాత్కాలిక కవచంలాగే కనిపిస్తోంది. మరి ఈ భారీ ఖర్చుల ప్రయోగం ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ముగింపునిస్తుందో కాలమే నిర్ణయించాలి.